తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

5

నిరాశే మిగిల్చింది

– హార్టికల్చర్‌ యూనివర్సిటీ పాత ముచ్చటే

– ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, జులై10 (జనంసాక్షి):

కేంద్ర బ్జడెట్‌ వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు.

రాష్టాన్రికి కొత్తగా ఇందులో ఏమీ ప్రతిపాదనలు చేయకపోవడం బాధాకరమని, అలాగే కొత్తగా కేటాయింపులు కూడా ఏమీ ఇవ్వలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యానవన యూనివర్సిటీ కూడా పునర్విభజన చట్టంలో ఉన్నదేనని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హార్టికల్చర్‌ యూనివర్సిటీ తప్ప రాష్టాన్రికి కేటాయింపులు లేకపోవడం బాధాకరమన్నారు. బడ్జెట్‌తో రాష్టాన్రికి నిరాశే మిగిలిందని అన్నారు. చట్టానికి కట్టుబడి ఉన్నామన్నారు తప్ప ఏ అంశానికీ నిర్దిష్ట ప్రస్తావన లేదని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్టాన్రికి కేటాయింపులు ఎక్కువగా ఉంటాయిని ఆశించినట్లు తెలిపారు. కేంద్రం కేటాయించిన ఉద్యాన విశ్వవిద్యాలయం కొత్తది కాదని, పునర్విభజన చట్టంలో ఉన్నదే అని గుర్తు చేశారు. ఇదిలావుంటే తెలంగాణ టీిఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా బడ్జెట్‌ ప్రతిపాదనలపై పెదవి విరిచారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెనుక బడిన తెలంగాణను కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్‌లో తెలంగాణ నిధుల ప్రస్తావన లేకపోవడం దారుణమని మండిపడ్డారు. ఆంధప్రదేశ్‌ మాదిరిగా తెలంగాణకు కూడా ఎయిమ్స్‌ను ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. సీమాంధ్ర నేతలు కేంద్రంలో లాబీయింగ్‌ చేసుకుని వారి కొత్త రాష్టాన్రికి కావాల్సినవి తీసుకోవచ్చని, కానీ తెలంగాణకు రావాల్సిన వాటిని మాత్రం తీసుకెళ్లొద్దని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.  బడ్జెట్‌లో ఆంధప్రదేశ్‌కు పోర్టులు, ఐఐటీలు వచ్చాయని తమకు ఎలాంటి బాధలేదన్నారు. కానీ తెలంగాణకు చెందాల్సిన పోలవరం జోలికి రావొద్దని కోరారు. పోలవరం తెలంగాణలోనే ఉండాలని అన్నారు. ఆంధప్రదేశ్‌కు మంచినీళ్లు రాలేదని, సాగునీరు రాలేదని ప్రతీసారి పేచికి దిగొద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఏపీ బడ్జెట్‌లా ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు మేం ఉన్నాం అనే భరోసా ఇవ్వాల్సిన కేంద్రం వెనుకడుగు వేసిందనే బాధ తప్ప మరో బాధలేదన్నారు. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి అభివద్ధి కుంటుపడే ప్రసక్తేలేదన్నారు. తెలంగాణ ప్రజలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో చంద్రబాబు, వెంకయ్యనాయుడుల నాటకాలు ఎన్నో రోజులు సాగవని జోస్యం చెప్పారు. ఏదో ఒకనాడు కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటుందనే అశాభావం వ్యక్తం చేశారు.