ఎన్డీయే ప్రభుత్వం చర్య ‘అనైతికం’
హైదరాబాద్ : పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభ ఆమోదించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణపై న్యాయ, రాజ్యాంగ నిపుణులను ప్రస్తుతం సంప్రదిస్తోంది.పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు కింద తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన అనేక గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ ఆమోదించిన పోలవరం ఆర్డినెన్స్ బిల్లును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే తెలంగాణ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు పొందుపరుస్తూ ఆర్డినెన్స్‌ను శుక్రవారం లోక్ సభ ఆమోదించడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ‘‘దురదృష్టకరం, అప్రజాస్వామికం’’గా ఆయన అభివర్ణించారు. లోక్ సభలో తమకు మెజారిటీ ఉందన్న కారణంగా ఎన్డీయే ప్రభుత్వం ఈ రకంగా ఆర్డినెన్స్ ఆమోదించడం ‘‘అనైతిక’’మని కెసిఆర్ వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించడానికి ముందు తెలంగాణ ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకుని, తమ అనుమతిని తీసుకోవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీ ఎంపీలు వాదించినప్పటికీ ప్రభుత్వం మాత్రం తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఈ చర్యకు పూనుకుందని ఆయన విమర్శించారు.బిజెపి, టిడిపికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్లమెంట్‌లో ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించి ఉండాల్సిందని ఆయన అన్నారు. లోక్ సభలో ఆర్డినెన్స్ ఆమోదం పొందినప్పటికీ దీనికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని కెసిఆర్ స్పష్టం చేశారు. ‘‘మా పోరాట పంథాను తరువాత ప్రకటిస్తాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులను సంప్రదిస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు.ఆర్డినెన్స్‌ను ఆమోదించడానికి బదులు పోలవరం డిజైన్‌ను మార్చి ఉంటే ఈ సమస్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య సామరస్యంగా పరిష్కారం అయి ఉండేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.