పోలవరంపై పోరాడుతాం
సుప్రీంను ఆశ్రయిస్తాం : సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూలై 11 (జనంసాక్షి) :
పోలవరం ఆర్డినెన్స్ ఆమోదంపై న్యాయపోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్డికల్-3 ఉల్లంఘన, రాష్ట్రాభిప్రాయాన్ని తీసుకోకపోవడటం, గిరిజనులకు రాష్ట్రపతి కల్పించిన హక్కులను కాలరాయటంపై తెలంగాణ సర్కార్ కోర్టును ఆశ్రయించనుంది. ఆంధప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును లోక్సభ శుక్రవారం ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో ఇంతకాలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న ఏడు మండలాలు చట్టబద్ధంగా ఆంధప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిపోయాయి. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మేలో కెసిఆర్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బిల్లు ఆమోదం పొందడంతో ఇప్పుడు అత్యవసరంగా నీటిపారుదల అధికారులు, మంత్రులతో చర్చించారు. పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్‌సభ ఆమోదించటంపై న్యాయపోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ పోలవరం విషయంలో కేంద్రం తీరు అప్రజాస్వామికమన్నారు. కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలవరం విషయంలో కేందప్రభుత్వం తీరు అప్రజాస్వామికమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం తీరుపై తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నామని ఆయన తెలిపారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌రెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు తదితర ఉన్నతాధికారులతో సమావేశమై పోలవరం అంశంపై సవిూక్ష జరిపారు.
పోలవరం బిల్లు పాస్ కావడం బాధాకరం : జానారెడ్డి
పోలవరం ఆర్డినెన్స్‌ను చట్టం చేయడం బాధాకరమని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోలవరం డిజైన్ మార్చి తెలంగాణకు నష్టాన్ని తగ్గించేలా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం మాట్లాడాలని సూచించారు. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. పోలవరం బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. శుక్రవారం సిఎల్పీలో మాట్లాడుతూ అసెంబ్లీ అభిప్రాయం తీసుకోకుండా 236 గ్రామాలను ఏపీలో కలపడం సరికాదన్నారు. పోలవరం వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పోలవరం డిజైన్ మార్చాలని అందు కోసం కేంద్రమే సాంకేతిక నిపుణుల్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముంపు గ్రామాలను తగ్గించి గిరిజనులను కాపాడాలన్నారు. సీలేరు హైడల్ పవర్ ప్లాంటును ఏపీకి అప్పగించేందుకే ఈ బిల్లు తెస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సీఎంల సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను కేంద్రం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే ఆర్డీఎస్ పనులు జరిగేందుకు ఏపీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఘర్షణ చేస్తే తీవ్ర పరిస్థితులుంటాయని హెచ్చరించారు. కర్ణాటక ప్రభుత్వం పోలీసు బందోబస్తు పెట్టైనా పనులు జరిపించాలన్నారు. ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడుతానని స్పష్టం చేశారు.