మేడమ్ జీ.. పోలవరం అడ్డుకోండి
సోనియాకు డీఎస్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) :
పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ పునర్వ్యస్థీకరణ సవరణ బిల్లును రాజ్యసభలో అడ్డుకోవాలంటూ తెలంగాణ శాసన మండలి పక్షనాయకుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కోరారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణం, బాధాకరమని ఆయన అన్నారు. పోలవరం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం బిల్లును అడ్డుకోవాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కోరారు. శనివారం డీఎస్ సోనియాతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఆమెకు నివేదించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. రాష్ట్రంలో పర్యటించాలని అధినేత్రిని ఆహ్వానించారు. సోనియాతో భేటీ ముగిసిన అనంతరం డీఎస్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సోనియాకు వివరించానని చెప్పారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆమెతో చర్చించానన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సోనియాకు వివరించానని తెలిపారు. పార్టీ బలోపేతానికి రాష్ట్రంలో పర్యటించాలని అధినేత్రిని విజ్ఞప్తి చేశానన్నారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని ప్రజల్లో బలమైన నమ్మకం ఉందన్నారు. ఎన్నికల్లో గెలుపోటమలు సహజమని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్ శ్రేణులతో వర్క్‌షాప్ నిర్వహిస్తామన్నారు. పార్టీలో ఏఐసీసీ స్థాయి నుంచి మార్పులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. పోలవరం బిల్లుపై కేంద్ర వైఖరి సరిగా లేదని డీఎస్ మండిపడ్డారు. పోలవరంపై యూపీఏ బిల్లుకు వ్యతిరేకంగా ప్రస్తుత కేంద్రం వైఖరి ఉందన్నారు. రాజ్యసభలో పోలవరం బిల్లును అడ్డుకోవాలని సోనియాను కోరినట్లు చెప్పారు. అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరానానన్నారు. పార్లమెంట్‌లో ధరల పెరుగుదలపై చర్చ సందర్భంగా రాహుల్‌గాంధీ నిద్ర పోవడాన్ని డీఎస్ సమర్థించుకున్నారు. గతంలో చాలా మంది ప్రధానులు, మంత్రులు పార్లమెంట్‌లో నిద్రపోయారని ఆయన గుర్తు చేశారు.