పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం
కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక రూపురేఖలు మార్చే హక్కు కేంద్రానికి లేదు
సుప్రీంలో కొట్టుడు పోతుంది : మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) :
పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, తెలంగాణ బిల్లు పక్రియ పూర్తి అయిందని, బిల్లును సవరణ చేసే శక్తి ప్రభుత్వం, పార్లమెంటుకు లేదని మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు ఆర్టికల్ 3, 4 ప్రకారం పాసైందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సవరణ ఎలా చేస్తారని జైపాల్‌రెడ్డి ప్రశ్నించారు. సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన విమర్శించారు. తెలంగాణ బిల్లు సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలను ఆంధప్రదేశ్‌కు బదలాయించారని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఆర్టికల్ 3,4 కింద పార్లమెంటుకు సర్వాధికారాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సవరణలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. పోలవరంపై తొందరపాటు చర్య తగదని యూపీఏ మంత్రివర్గంలో ఉన్నపుడే తాను తీవ్రంగా వ్యతిరేకించానని గుర్తు చేశారు. ముంపు ప్రాంతాలను ఉద్దేశ్యపూర్వకంగా సీమాంధ్రలో కలిపారని ముంపు మండలాలన్ని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ బిల్లుకు సవరణ చేసే శక్తి ప్రభుత్వానికి, పార్లమెంట్‌కు లేదని స్పష్టం చేశారు. కోర్టులో ఇది నిలవదన్నారు. అయితే సభలో మెజార్టీ ఉన్నందున మళ్లీ బిల్లును పాస్ చేయించుకునే అవకాశం ఉన్నా ముంపు మండలాలను పూర్తిగా కలిపేసుకోవడం సరికాదన్నారు. తనకు తెలిసినంత వరకు పోలవరం ఆర్డినెన్స్ బిల్లు సుప్రీంకోర్టులో నిలువదని జైపాల్‌రెడ్డి అన్నారు. రాజ్యసభలో ప్రతిపాదించడానికి ముందైనా బిల్లుపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు తొందరపడిందో తెలియడం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 ప్రకారం తెలంగాణ బిల్లు పక్రియ ముగిసిందని ఆయన చెప్పారు. పోలవరం ముంపు ప్రాంతాలను గ్రామం యూనిట్‌గా విభజన బిల్లులో చేర్చామని, ఇప్పుడు మండలాలను యూనిట్‌గా పరిగణిస్తూ ఎన్డిఎ ప్రభుత్వం బిల్లు తెచ్చిందని, అందువల్ల అది రాజ్యంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులోనే పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చామని, ఇప్పుడు అదనంగా కొన్ని గ్రామాలను చేరుస్తూ బిల్లు తెచ్చారని ఆయన చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి ఇతర గ్రామాలను వాడుకోవాలని చూస్తున్నారని, అయితే, తమకు ప్రాజెక్టు కింద సాగు భూమి ఇవ్వాలని ముంపు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఆ గ్రామాలను ఆంధప్రదేశ్‌లో చేర్చినా ప్రాజెక్టు పూర్తి కావడానికి తెలంగాణ ప్రభుత్వ సహకారం అవసరమని ఆయన అన్నారు. అధికార పరిధిలో లేనిదానిపై ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిందని ఆయన అన్నారు. దాన్ని తేవాలంటే రాజ్యాంగంలోని 3,4 ఆర్టికల్స్ కింద తేవాలని ఆయన అన్నారు. బిల్లును లోకసభలో ఆమోదించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా బిల్లు ఎలా తెస్తారని ఆయన అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చడాన్ని తాను మంత్రివర్గంలో వ్యతిరేకించానని, అయినా అది ఆమోదం పొందిందని, అయితే తమ ప్రభుత్వం దాన్ని రాష్ట్రపతికి పంపించలేదని వివరించారు. నిరంకుశంగా, ఏపక్షంగా సవరణలను రుద్దడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య స్నేహభావం మరింతగా బలహీనపడుతుందని ఆయన అన్నారు.