8న భద్రాచలం ఐటిడిఎ సమావేశం

విలీన మండాలు,పోడు సమస్యలపై ప్రధాన దృష్టి
పోడురైతుపై కేసులపైనా పత్యేక చర్చ సాగే అవకాశం
హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు

 

భద్రాచలం,జూలై7(జనంసాక్షి ): సుదీర్ఘ విరామం తరువాత భద్రాచలం ఐటీడీఏ పాలక మండలి సమావేశం శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో జరుగునుంది. భద్రాచలం ఐటీడీఏ పాలక మండలి సమావేశం 34నెలల తరువాత నిర్వహిస్తుండటంతో ఈ సమావేశం ఎంతో కీలకంగా మారనుంది. చివరిసారిగా 2019 ఆగస్టు 13న ఐటీడీఏ పాలక మండలి సమావేశం నిర్వహించారు. తిరిగి 34నెలల అనంతరం సమావేశాన్ని నిర్వహిస్తుండటంతో 21 తైమ్రాసిక బడ్జెట్‌లకు ఐటీడీఏ సమావేశంలో ఆమోదం తెలపాల్సి ఉందని
అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి జరిగే సమావేశంలో ఏపీ పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీలు భద్రాచలంలో విలీనం చేయడం, పోడు భూముల పట్టాల సమస్యపై ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీ పరిధిలోకి వెళ్లిన మండలాల్లో భద్రాచలం నుంచి ఏపీ వైపు వెళ్లిన యటపాక, పురుషోత్తట్నం, పిచుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల పంచాయ తీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలనే డిమాండ్‌ ఉంది. ముంపు మండలాలు ఏపీలో విలీనం చేసిన నాటి నుంచి వ్యక్తమవుతూనే ఉంది. ఈ క్రమంలో పలుమార్లు ఈ డిమాండ్‌పై వివిధ రాజకీయ పార్టీలు, స్థానికులు తమదైన శైలిలో ఆందోళన నిర్వహించారు. గత పాలకమండలిలో కూడా ఐదు పంచాతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలంటూ తీర్మానం చేశారు. తాజాగా ఈ ఐదు పంచాయ తీలపై ఐటీడీఏపాలక మండలి వేదికగా తీర్మానం చేసి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఉన్న పోడు భూములకు పట్టాల సమస్య ఉండగా.. మన్యం ప్రాంతం నిత్యం వివాదాలతో రగిలిపోతోంది. వేల మందిపై కేసులు నమోదు అవుతున్నా సర్కారు నోరు మెదపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం హావిూలు ఇవ్వడమే తప్ప ఆచరణలో ఆమడ దూరంలో ఉంటుందని విమర్శస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోనే పోడుదారులు 82,737 మంది 2,94,700 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. రెవెన్యూ, అటవీ భూములకు మధ్య ఉన్న హద్దులను గుర్తించకపోవడం, శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల ఈ వివాదం జటిలమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పోడు భూముల కోసం గంపెడాశతో ఎదురు చూస్తున్న సాగుదారులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పోడు భూముల సమస్యలపై ఈసారి సమావేశంలో విశేషంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనతో తలెత్తుతున్న సమస్యలు జిల్లాల పునిర్వభజన అనంతరం ఐటీడీఏలు ఉన్న చోట సాంకేతికపరమైన పరిపాలనపరమైన సమస్యలు అధికారులకు తలెత్తుతున్నాయి. దీంతో ఆదివాసీలు, గిరిజనులకు పూర్తిస్థాయిలో సత్వర న్యాయం, సమస్యలకు పరిష్కారం లభించని పరిస్థితి ఏర్పడుతోందని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. గతంలో భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్న మండలాలు నాలుగు జిల్లాల పరిధిలో నేడు విస్తరించి ఉన్నాయి. అవి నేడు 32 మండలాలుగా ఉండటంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో భౌగోళికం గా వెళ్లినా పరిపాలనపరంగా భద్రాచలం ఐటీడీఏ పరిధిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఐటీడీఏల విభజన చోటు చేసుకోకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నా యన్న
వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా జిల్లాల పునర్విభజన, పోలవరం ముంపు మండలాలు ఏపీలో విలీనం, గతంలో ఐటీడీఏలో ఉన్న నీటి పారుదల శాఖ బయటకు వెళ్లిందని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఏజెన్సీలోని విద్యా వ్యవస్థను పర్యవేక్షించేందుకు ఏజెన్సీ డీఈవో పోస్టు ఇప్పుడు లేకపోవడంతో సమస్యలు తలెత్తినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏజెన్సీలోని ఎత్తిపోతలపథకాలను పర్యవేక్షిం చేందుకు గతంలో స్పెషల్‌ ఎంఐ ఈఈ పర్యవేక్షణ ఉండగా నేడు ఆ పోస్టు లేకపోవడంతో పరిపాలన పరంగా పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడు తోందని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరు కానుండటంతో అధికారులను పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ ఆదేశించారు. గిరిజన భవనం ప్రారంభం అనంతరం అందులోనే పాలక మండలి సమావేశన్ని నిర్వహించనున్నారు. నూతనంగా నిర్విహించిన గిరిజనభవనంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు, గిరిజనులు ఎదుర్కొం టున్న వివిధ రకాల సమస్యలకు పరిష్కారం లబిస్తుందన్న ఆశ వ్యక్తమవుతోంది. నాలుగు జిల్లాల నుంచి తరలిరానున్న 1500 మంది భద్రాచలం ఐటీడీఏ నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల నుంచి సుమారు 1500 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు వచ్చే అవకాశం ఉన్నట్టు భద్రాచలం ఐటీడీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నాలుగు జిల్లాల కలెక్టర్లు అన్ని విభాగాల కీలక అధికారులకు, జడ్పీచైర్మన్లకు ఇప్పటికే సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.