800 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించండి
మాల్దీవుల ప్రభుత్వాన్ని జీఎంఆర్ డిమాండ్
న్యూఢిల్లీ, జనంసాక్షి :మాల్దీవుల ప్రభుత్వం నుంచి భారత్ మౌలికరంగ కంపెనీ జీఎంఆర్ 800 మిలియన్ల పరిహారం కోరుతోంది. అక్కడ నిర్మాణం కావాల్సిన ఎయిర్ పోర్టు ప్రాజెక్టును అక్కడి ప్రభుత్వం రద్దు చేయడంతో జీఎంఆర్‌కు నష్టం వాటిల్లింది. కాగా, ఈ నష్టంపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆ ప్రభుత్వాన్ని కోరింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 800 మిలియన్ డాలర్ల నష్టం కంపెనీకి వాటిల్లింది. లాభార్జనలో నష్టం శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కంపెనీ ప్రధాన ఆర్థిక అధికారి సిద్ధార్థ్ కపూర్ పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ సంస్థ ద్వారా ఆడిట్ చేసి లెక్కలు తేల్చాలని మాల్దీవుల ప్రభుత్వం పట్టుబడుతోంది. ఇప్పటి వరకు జీఎంఆర్ కేవలం 150 మిలియన్ డాలర్లు మాత్రమే వెచ్చించినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తేనే అసలైన లెక్కలు తెలుతాయని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ వహీద్ తెలిపారు. తమ లెక్కల ప్రకారం 150-350 మిలియన్ డాలర్ల మధ్యే ఉంటుందని పేర్కొన్నారు.