తెలంగాణ టీడీపీ, భాజాపా ఎంపీలు మీరు ఎటు వైపో తెల్చుకోండి: కేటీఆర్
హైదరాబాద్ (జనంసాక్షి):
రాజ్యసభలో తెలంగాణ టీడీపీ, భాజాపా ఎంపీలు మీరు ఎటు వైపో తెల్చుకోండి అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ, చత్తీస్‌ఘగ్, ఒడిశా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం ప్రభుత్వం లోక్‌సభలో నిరంకుశంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. లోక్‌సభలో మందబలంతో బిజెపి పోలవరం బిల్లును ఆమోదింపచేసుకుందని మండి పడ్డారు. ఆదివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభలో సభ్యుల అండతో ఎన్డీయే ప్రభుత్వం పోలవరం బిల్లును ఆమోదింపచేసుకున్నా.. రాజ్యసభలో ఆ పార్టీకి 50 మందికి మించి బలం లేదని అన్నారు. రాజ్యసభలో పోలవరం బిల్లును ఓడించేందుకు పోరాడుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తలచుకుంటే రాజ్యసభలో పోలవరం బిల్లు నిలిచిపోతుందన్నారు. అంతేకాకుండా పోలవరంపై ఆ పార్టీ వైఖరేంటో తెలిసిపోతుందన్నారు. ఈ అంశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాటల్లో కాకుండా చేతల్లో చూపాలన్నారు. జానారెడ్డి, పొన్నాల ఢిల్లీ వెళ్లి రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించేలా సోనియాగాంధీ ఇంటిముందు ధర్నాకు దిగి ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ నాయకులు చేవగల నేతలుగా పనిచేస్తారా? లేక ఆంధ్రా నేతలకు దాసోహం అంటారా? తేల్చుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రాజ్యసభలో టిఆర్‌ఎస్ పార్టీకి ఒక్కరే సభ్యులు ఉన్నప్పటికీ పోలవరం బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తామని, మరి ముగ్గురు సభ్యులున్న టిటిడిపి ఎటువైపు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్‌లో రాష్ట్రానికి ప్రాతినధ్యం కల్పించకపోయినా, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినా రాష్ట్ర టిడిపి, బిజెపి నాయకులు ఇప్పటి వరకూ నోరు మెదపలేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పోయిందేమిలేదని ఆదివాసీల ప్రయోజనాల కోసం స్పందించి పోలవరానికి వ్యతిరేకంగా టిఆర్‌ఎస్ చేస్తోన్న పోరాటానికి మద్దతు పలకాలని కోరారు. ఏపీ ప్రభుత్వం న్యాయ బద్దంగా ఆ రాష్ట్రానికి రావాల్సిన అన్ని వాటాలను తెచ్చుకోవచ్చని అన్నారు. అయితే తెలంగాణ ప్రజలకు అన్యాయం చెయవద్దని కేటీఆర్ పేర్కొన్నారు. రాజ్యసభలో పోలవరం బిల్లుపై ఓటింగ్‌కు పట్టుబడుతామని, ఎలాగైనా ఈ బిల్లును ఓడించేందుకు కృషి చేస్తామన్నారు.