భాజపా సీనియర్‌ నేతలు ఐదు రాష్ట్రాల గవర్నర్లు?

1

న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) :

పార్టీ సీనియర్‌ నేతలకు రాజకీయ పునరావసం కల్పించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. కొత్తగా ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించేందుకు రంగం సిద్ధం చేసింది. యూపీఏ పాలన కాలంలో నియమితులైన గవర్నర్లు పదవులకు రాజీనామా చేయాలని మోడీ సర్కారు ఇప్పటికే కోరిన నేపథ్యంలో కొందరు తమ పదవులను వదులుకున్నారు. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో సాక్షులుగా సీబీఐ విచారణను ఎదుర్కొన్న పశ్చిమబెంగాల్‌, గోవా గవర్నర్లు కూడా పదవులకు రాజీనామా చేశారు. ఇదే వ్యవహారంలో విచారణను ఎదుర్కొన్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మాత్రం రాజీనామాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల గవర్నర్‌ పదవులను భర్తీ చేయడంపై మోడీ సర్కారు దృష్టి సారించింది. బీజేపీ సీనియర్‌ నేతలు రామ్‌ నాయక్‌, విజయ్‌ కుమార్‌ మల్హోత్రా, కె. శ్రీనాథ్‌ త్రిపాఠి, కైలాష్‌ జోషి, బలరామ్‌ దాస్‌ టాండన్‌ను త్వరలోనే గవర్నర్లుగా నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. యూపీఏ హయాంలో నియమితులైన బీఎల్‌ జోషి, ఎంకే నారయణన్‌, వాంచూ, హెచ్‌ఆర్‌ భరద్వాజ, పురుషోత్తమన్‌ తమ పదవులకు రాజీనామా చేయగా గుజరాత్‌ గవర్నర్‌గా ఉన్న కమలా బేణివాల్‌ను మిజోరాంకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. వీరి రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాల్లో కొత్త గవర్నర్లను నియమించనున్నారు.