రాజ్యసభలో పోలవరం ఆపాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే

2

మెజారిటీ సభ్యులు ఆ పార్టీకే ఉన్నారు

ఓటింగ్‌కు పట్టుబడతాం

అందరి రంగులు బయటపెడతాం

టీ టీడీపీ తెలంగాణ వైపా? సీమాంధ్ర తొత్తులుగా మిగులుతుందా?

ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు

హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) :

పోలవరం పేరుతో మోడీ సర్కారు అమాయక ఆదివాసీలను ముంచడానికి కుట్ర పన్నుతోందని, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి ఖమ్మం జిల్లా ప్రజలు ముఖ్యంగా గిరిజనులపట్ల ప్రేమ ఉంటే రాజ్యసభలో పోలవరం ఆర్డినెన్స్‌ను అడ్డుకోవాలని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు డిమాండ్‌ చేశారు. ప్రతి అంశంపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి చెప్పి ఒత్తిడి తెచ్చి బిల్లును అడ్డుకోవాలని కోరారు. ఆదివారం నగరంలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని గొప్పలు చెబుకుంటున్న బీజేపీ నేతలు తమ మౌనాన్ని వీడి పోలవరం బిల్లు అడ్డుకోవాలని, అందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. వారు ఇంకా ఆంధ్ర నేతల పెత్తనాన్ని ఒప్పుకుంటే ఆ పార్టీని ఆంధ్రలో కలపాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేతలు పేపరు ప్రకటనలు మాని ఆదివాసీల పక్షాన తమ అధినాయకత్వం నిలబడేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మందబలం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రాజ్యసభలో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉంది కాబట్టి టీ పీసీసీ నేత పొన్నాల లక్ష్మయ్య, శాసనసభాపక్షం నాయకులు జానారెడ్డిలు ఢిల్లీకి వెళ్లి తమ నాయకురాలితో చర్చించి అడ్డుకునే ప్రయత్నంచేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి కె.కేశవరావు ఒకే సభ్యుడు ఉన్నాడని, టీడీపీ నుంచి ముగ్గురు సభ్యులు ఉన్నారని, రాజ్యసభలో ఓటింగ్‌ పెడితే ఎవరు ఎటువైపు ఉంటారో స్పష్టమవుతుందన్నారు. పోలవరం విషయంలో టీఆర్‌ఎస్‌ ఒకే వైఖరితో ఉందన్నారు. పోలవరం డిజైన్‌ మార్చాలని ఆంధ్ర ఇంజినీర్లు పేర్కొంటున్న విషయాన్ని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆదివాసీల కోసమైనా బీజేపీ నేతలు నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు.