నోటీసులకు ముందే ఎన్ కన్వెన్షన్ కూల్చేసుకుంటున్న యాజమాన్యం
స్వచ్ఛందంగా కూల్చేసి అక్రమమేనని ఒప్పుకున్న నాగార్జున
హైదరాబాద్, జూలై 13 (జనంసాక్షి) :
అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేయకముందే ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం కూల్చివేతలు మొదలు పెట్టింది. కోర్టు ద్వారా స్టేటస్ కోకు ప్రయత్నించి పిల్లిమొగ్గలేసిన సినీ హీరో నాగార్జున స్వచ్ఛందంగా కూల్చివేతలు మొదలు పెట్టి అది అక్రమ నిర్మాణమే అని అంగీకరించాడు. నగరంలోని మాదాపూర్‌లో గురుకుల్ ట్రస్టు భూమిలోని తమ్మిడి చెరువు, కుంటచెరువు శిఖం స్థలంలో సినీనటుడు నాగార్జున నిర్మించిన ఎన్‌కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణంగా జిహెచ్‌ఎంసి అధికారులు గుర్తించారు. కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణమని అధికారులు దాని గోడలపై రెడ్‌మార్క్ చేసింది. అయితే, ఈ భూమిని తాము న్యాయబద్ధంగా కొన్నామని సంస్థ యాజమాన్యం పేర్కొంది. దీనిపై న్యాయం చేయాలంటూ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యం పిటిషన్‌ను విచారణను స్వీకరించిన కోర్టు కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేతకు ముందు నోటీసులు ఇవ్వాలని జిహెచ్‌ఎంసిని ఆదేశించింది. అయితే, ఇది అక్రమ నిర్మాణం కావడంతో కోర్టులో కూడా తిరిగి తమకు చుక్కెదురు తప్పదని భావించిన యాజమాన్యం జిహెచ్‌ఎంసి నుండి నోటీసులు అందకముందే శనివారం నుండి స్వచ్ఛందంగా కూల్చివేతలు చేపట్టింది. దీనికి సంబంధించి కేసు కొత్త మలుపు తిరిగింది. గురుకుల్ ట్రస్టులో అక్రమ నిర్మాణాలను తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం ఈ చెరువు శిఖంలో కన్వెన్షన్ సెంటర్ 3 ఎకరాల 12 కుంటల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నట్లు అధికారులు గుర్తించారు. కేసు కోర్టులో ఉన్నందున యాజమాన్యం తన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేసుకోవడం చర్చనీయాంశమైంది. శనివారం ప్రారంభమైన ఈ కూల్చివేతల కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగుతోంది.