బ్రెజిల్‌ చేరుకున్న ప్రధాని మోడీ

5

అంతర్జాతీయ వేదికపై తొలి భాగస్వామ్యం

ఫోర్టాలెజా/న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) :

ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం రాత్రి బ్రెజిల్‌ చేరుకున్నారు. ఫోర్టాలెజాలో సోమ, మంగళవారాల్లో జరుగనున్న బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రత్యేక అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు, ఐక్య రాజ్యసమితితో పాటు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై చర్చిస్తారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ తొలిసారిగా అంతర్జాతీయ వేదికను పంచుకోనున్నారు. మోడీ వెంట కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు అధికారులతో కూడిన బృందం బ్రెజిల్‌కు చేరుకుంది. మోడీ ఈ పర్యటనలో బెర్లిన్‌లో జర్మనీ చాన్స్‌లర్‌ మోర్కెల్‌తో భేటీ కావాల్సి ఉండగా, ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ఆ దేశం చేరుకోవడంతో ఆయన ఫైనల్‌ తిలకించేందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ పర్యటన రద్దయింది. ఈ సమావేశాల్లో రూ.5 లక్షల కోట్లతో బ్రిక్స్‌ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు, దీనిలో సభ్య దేశాల్లో ఎవరి వాటా ఎంత?, ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలతో పాటు వాణిజ్యం, తదితర అంశాలపై చర్చలు జరుపుతారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జుమా తదితరులతో ఈ సందర్భంగా మోడీ భేటీ అవుతారు.