కరెంటు కష్టాలపై దృష్టి సారించండి

2

యుద్ధ ప్రాతిపదికన పనిచేయండి : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ లోటుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. తక్షణమే ఆరువేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి రంగం సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ జెన్‌కోను ఆదేశించారు. విద్యుత్‌ రంగంపై ఆయన సోమవారం అధికారులతో సమీక్షించారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను గుర్తించాలని సూచించారు. ఎన్‌టీపీసీ రామగుండంలో 4వేల మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ఉత్పత్తి కోసం పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి 2వేల మెగావాట్ల విద్యుత్‌ తెచ్చేలా పవర్‌లైన్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించాలని తెలిపారు. జలవిద్యుత్‌ ఉత్పత్తికి నదులపై ప్రత్యేక సర్వే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. విద్యుదుత్పత్తికి ఛత్తీస్‌గఢ్‌ నుంచి ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి విద్యుత్‌ ఉన్నతాధికారులకు సూచించారు. విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక సర్వే చేసి నదులపై అదనంగా విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు పరిశీలించాలని నిర్దేశించారు. విద్యుత్‌ సమస్య తరుముకుని వస్తున్న తరుణంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌ నుంచి తక్షణం విద్యుత్‌ లైన్లు వేయాలన్నారు. పంటలకు, గృహాలకు 24 గంటలు విద్యుత్‌ అందించేలా ప్రణాళికలను అమలు చేయాలన్నారు. ఇదిలావుంటే  సచివాలయంలో దేవాలయాల భూములపై దేవాదాయ శాఖ కమిషనర్‌తో సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ భూముల పరిరక్షణపై చర్చించినట్లు సమాచారం. బంజారాహిల్స్‌లోని యాదగిరిగుట్ట భూముల విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేశాలయ భూముల రక్షణపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.