ఆదివాసుల్ని ముంచే ప్రాజెక్టే పోలవరం

4
జంతర్‌ మంతర్‌ వద్ద జేఏసీ ధర్నా

న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) :

పోలవరం ఆదివాసుల్ని ముంచే ప్రాజెక్టేనని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఆదివాసీలకు అన్యాయం చేయొద్దని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. లక్షలాది మంది గిరిజనులను ముంచే ప్రాజెక్టు నిర్మాణం అవసరమా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని డిజైన్‌ మార్చాలన్నదే తమ అభిమతమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండా ఏడు మండలాలను ఏ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తారని నిలదీశారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద టీ-జేఏసీతో పాటు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కోదండరాంతో పాటు అన్ని రాజకీయ పక్షాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మీడియాతో మాట్లాడారు. ముంపు ప్రాంతాలను ఏపీలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండా రాష్ట్ర సరిహద్దులను ఏవిధంగా మారుస్తారని ప్రశ్నించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకొని కేంద్రం ముందుకెళ్లాలని సూచించారు. రాజ్యసభలో పోలవరం బిల్లును అడ్డుకోవాలని కోదండరాం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. బిల్లు ఆమోదం పొందకుండా చూసే బాధ్యత కాంగ్రెస్‌కే ఉందన్నారు. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి మెజార్టీ లేదని.. కాంగ్రెస్‌ సహా అన్ని జాతీయ పార్టీలకు మాట్లాడే అవకాశం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఆకాంక్షను వ్యక్తమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనులను ముంచి ప్రాజెక్టు కట్టడం ఏవిధంగా న్యాయమో నిలదీయాలని కోరారు. ఆదివాసీలకు న్యాయం జరిగేలా అన్ని పార్టీలు వ్యవహరించాలన్నారు. తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని.. డిజైన్‌ మార్చాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. డిజైన్‌ మార్చడం వల్ల ముంపు ప్రాంతాలు తగ్గి గిరిజనులకు మేలు కలుగుతుందని తెలిపారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకూ జేఏసీ పోరాటం చేస్తుందన్నారు. వారికి న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇందుకోసం కోర్టులు సహా అన్ని వేదికలను ఉపయోగించుకుంటామన్నారు.

పోలవరం సెగ హస్తినలో రగిలింది. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలతో రాజధాని ¬రెత్తింది. రాజ్యసభలో తెలంగాణ, ఒడిశా ఎంపీలు నిరసనలు చేపట్టగా.. జంతర్‌మంతర్‌ వద్ద టీ-జేఏసీ, వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. పోలవరం ప్రాజెక్ట్‌ డిజైన్‌ మార్చాలని, ఆదివాసీలకు అన్యాయం చేయొద్దని డిమాండ్‌ చేశాయి. సోమవారం ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, ఒడిశాకు చెందిన బీజేడీ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సరికాదని ఆదివాసీలను ముంచొద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. సభా కార్యకలాపాలను స్తంభింపజేశారు. దీనికి తోడు వివిధ అంశాలపై ఇతర పక్షాలు ఆందోళనలు దిగడంతో సభ రెండుమార్లు వాయిదా పడింది. మరోవైపు పోలవరం ముంగు మండలాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ టీ-జేఏసీ, వామపక్షాల ఆధ్వర్యంలో జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. అన్ని పక్షాల నేతలు ఈ ఆందోళనకు హాజరయ్యారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం రాజ్యాంగ విరుద్ధమని టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా రాష్ట్ర సరిహద్దులను మార్చే అధికారం కేంద్రానికి లేదన్నారు. ఆదివాసీలను నిలువునా ముంచే ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్‌ను మార్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుకు తెలంగాణ వాసులు వ్యతిరేకం కాదని డిజైన్‌ మార్చాలన్నదే అందరి అభిమతమన్నారు. ప్రాజెక్టును తెలంగాణతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్‌ వ్యతిరేకిస్తున్నందున నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి కేంద్రం చర్చించాలని సూచించారు. ముంపు గ్రామాల విలీనానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ ముంపు గ్రామాలను దక్కించుకొనేందుకు అన్ని పోరాటాలు చేస్తామన్నారు. స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముంపు గ్రామాలను వదులుకొనే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ఆర్డినెన్స్‌ బిల్లును రాజ్యసభలో అడ్డుకుంటామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు తెలిపారు. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి రాపోలు ఆనందభాస్కర్‌ తదితరులు జంతర్‌మంతర్‌ వద్ద జేఏసీ చేపట్టిన ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. పోలవరం ముంపు గ్రామాల విలీన వ్యతిరేక పోరాటానికి వారు మద్దతు తెలిపారు. వీహెచ్‌ మాట్లాడుతూ.. ఆదివాసీలను ముంచే ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని తెలిపారు. పోలవరం డిజైన్‌ మార్చాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ఆర్డినెన్స్‌ బిల్లుపై వ్యవహరించాల్సిన అంశంపై గులాం నబీ ఆజాద్‌ తమతో సంప్రదించారని తాము మాత్రం వ్యతిరేకిస్తామని ఆయనకు తేల్చి చెప్పామన్నారు.ఇదిలా ఉంటే, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వ్యవహరించాలని ఆయన సోనియాను కోరారు. పోలవరం బిల్లును రాజ్యసభలో ఆమోదించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో కేంద్రానికి మెజార్టీ లేదు. కాంగ్రెస్‌ మద్దతు లేనిదే బిల్లు ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో తెలంగాణ ప్రాంత నేతలు హైకమాండ్‌పై ఒత్తిడి పెంచారు. బిల్లు ఆమోదించకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పోలవరం బిల్లుపై పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ రాజ్యసభ సభ్యులతో సమావేశమయ్యారు. పోలవరం ఆర్డినెన్స్‌ బిల్లుకు మద్దతివ్వాలని ఆయన ఎంపీలకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే, తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని.. కచ్చితంగా సభలో బిల్లును అడ్డుకుంటామని తెలంగాణ ప్రాంత ఎంపీలు వీహెచ్‌, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్‌, రేణుకా చౌదరి, ఎంఏ ఖాన్‌ స్పష్టం చేశారు.