నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

3

పలు కీలకాంశాలపై నిర్ణయం

హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బుధవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. వివిధ అంశాలపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా పోలవరం సమస్య, విద్యుత్‌ పీపీఏలు, విద్యుత్‌ కొరత, అక్రమ భూముల స్వాధీనం, పారిశ్రామిక విధానం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రుణమాఫీ తదితర అంశాలను చర్చించే అవకాశాలు ఉన్నాయి. రుణమాఫీపై ఈ కేబినేట్‌లో ఓ నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకంపైనా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇక కొత్తరేషన్‌ కార్డుల జారీకి మార్గదర్శకాలను రూపొందిస్తారు. ప్రధానంగా పోలవరంపై తదుపరి తీసుకోవాల్సి చర్యలు. సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన అవసరాన్‌ఇన చర్చిస్తారు. ఇక హైదరాబాద్‌ అభివృద్ధితో పాటు ఇక్కడి భూములను అన్యాక్రాంతం చేసుకున్న వారిపై ఇటీవలి కాలంలో తీసుకున్న చర్యలపైనా కేబినేట్‌ చర్చించే అవకాశం ఉంది. జూన్‌ 2న ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత ఇప్పటి వరకు తీసుకున్న, తీసుకోబోయే వివిధ అంశాలను చర్చించి నిర్ణయాలు చేస్తారు. అలాగే ఆయా కార్యక్రమాలపై ప్రభుత్వ విధానాలను రూపొందిస్తారు. ఈ మేరకు  సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ స్వయంగా వెల్లడించనున్నట్లు సమాచారం. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా నీటి పారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ను నియమించింది. ఇక పారిశ్రామికవేత్తలు సులభమైన పద్ధతిలో రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించుకోవచ్చని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇందు కోసం తమ ప్రభుత్వం సింగిల్‌ విండో పద్ధతి ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. వారంలోగా కొత్త పారిశ్రామిక విధానానికి రూపకల్ప చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు ఆయన పరిశ్రమల శాఖ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. గుర్తించిన స్థలాలను ఇండస్టియ్రల్‌ పార్కులుగా ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుందన్నారు. తాగునీటి ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని పరిశ్రమలకు కేటాయించాలని సూచించారు. హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. వరంగల్‌ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)ను నిర్మింపజేస్తామన్నారు. రాష్ట్రంలో దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వీటన్నిటిపైనా కేబినేట్‌లో చర్చించే అవకాశాలు ఉన్నాయి.