తెలంగాణపై మోడీ సర్కార్‌ సవతి తల్లి ప్రేమ

4
ఎన్‌డీఏ పక్షాలకు ఒకలా.. విపక్షాలకు మరోలా?

కేంద్ర ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శ

హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) :

నవజాత శిశువు తెలంగాణ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోన్న సీమాంధ్ర శక్తులకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వంత పాడుతోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోంది. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న చందంగా తెలంగాణతో పాటే ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ సర్కారుపై వల్లమాలిన ప్రేమ కనబరుస్తూ తెలంగాణపై సవతి తల్లి ప్రేమతో సరిపెడుతోంది. ఏపీలో ఉన్నది తమ అనుకూల ప్రభుత్వం కాబట్టి వారికి వరాలు కురిపిస్తూ తెలంగాణలో ఉన్న విపక్ష ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాల్జేస్తోంది. అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం తమ భాగసామ్యపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఒకలా, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను మరోలా చూస్తోంది.

రాష్ట్రాలను సమన్యాయంతో సపరిపాలన చేయాల్సిన బాధ్యత తల్లిలాంటి కేంద్రంపై ఉంది. కాని మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచి ఢిల్లీ పీఠమెక్కిన భారతీయ జనతా పార్టీ ఏపీ, తెలంగాణ విషయంలో ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. పోలవరం అనుమతులు, గవర్నర్‌కు అధికారాలు, రైల్వే, సాధారణ బడ్జెట్‌ కేటాయింపులు ఇతరత్ర విషయాల్లో తెలంగాణపై చిన్నచూపు చూసింది. ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నీళ్లు, విద్యుత్తు, ఉద్యోగుల పంపకాల విషయాల్లో విభేదాలున్నాయి. వీటికి తోడు కేంద్రం, ఏపీ సర్కార్‌ ఆడించినట్లుగా ఆడడం టీ సర్కార్‌కు ఆగ్రహం తెప్పిస్తుంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలకు నష్టం, కష్టం కలిగించే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ఓ వరమని పోలవరం ఆర్డినెన్స్‌ను ఆఘమేఘాల మీద కేంద్రం తీసుకొచ్చింది. పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకుంది. దాదాపుగా నాలుగు రాష్ట్రాల పంచాయితీ అయిన పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లే సమయంలో కేంద్రం ఆ రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తీసుకోకపోవడం శోచనీయం. ఆర్డినెన్స్‌ నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీ విభజన సమయంలోనే జరిగిందని, తాము కేవలం అమలు చేస్తున్నామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాలను అమలు చేయడాకే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సరిహద్దులు మార్చే పనిని హద్దులు దాటి చేశారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది. అన్నింటికన్నా మిన్నా ఆదివాసీలకు నీడ లేకుండా చేయడం. ఏడు ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రలోకి కలిపిన కేంద్రం బాధితులకు, ముఖ్యంగా ఆదివాసులకు పునరావాసంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. అందమైన సుందర నగరాలను, పట్టణాలను అధికారం, మంది మార్భలంతో నిర్మించవచ్చు. కాని గిరిజనులు ఆదివాసులు నివసించే అటవీ ప్రాంతాన్ని ఎలా నిర్మిస్తారు. జంగిల్‌ వదిలి కాంక్రీట్‌ జంగిల్‌లోకి వారు రాలేరు. ఇక హైదరబాద్‌లో శాంతిభద్రతల సమస్య ఏదో తలెత్తినట్లు గవర్నర్‌కు అధికారాలు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాయడం, అక్కడి నుంచి సర్కులర్‌ రావడం చక చకా జరిగిపోయింది. ఈ అంశానికి సంబంధించి పూర్వాపరాలు పరిశీలిస్తే కేసీఆర్‌ ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని రోజుల్లోనే అన్యాక్రాంతమైన భూముల స్వాధీనానికి దృష్టి పెట్టారు. అందులో భాగంగా అయ్యప్ప సొసైటీ, సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, సినిమాలకు సంబంధించిన అకాడమీ, ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన భూముల స్వాధీనానికి కొత్త ప్రభుత్వం నడుంబిగించింది. ప్రభుత్వం ఏ లక్ష్యంతో కేటాయించిందో అది నెరవేరనప్పడు, వనరులు కబ్జా అవుతున్నప్పుడు సంపద కాపాడే బాధ్యత సర్కార్‌పై ఉంటుంది. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిందికూడా అదే. అయినా ఒక ప్రభుత్వం కేటాయించిన భూములను మరో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం.. సర్వసాధారణ విషయం. కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అనంతపురంలో కేటాయించిన లేపాక్షికి చెందిన భూములను కొత్త టీడీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు నోటీసులు ఇవ్వడమే ఇందుకు చక్కని ఉదాహరణ. మరి అక్కడ గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు అవసరం లేదా? ఏపీలో వైఎస్‌ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, అక్కడ హత్యలు జరుగుతున్నాయని ఆ పార్టీ నాయకులు రాష్ట్రపతి వరకు వెళ్లారు. అది కేంద్రానికి కనిపించడం లేదా? శాంతిభద్రతల సమస్య ఎక్కడ ఉన్నట్టు? ఏ ప్రాంతంలో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు అవసరమో దీనిని బట్టి కేంద్రం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు. అరవై ఏళ్ల పోరాటంతో తెలంగాణను సాధించుకుని ఆత్మగౌరవంతో స్వయంపాలకు అడుగులు వేస్తున్న తరుణంలో గవర్నర్‌కు అధికారాలంటూ కుట్ర జరగడం తెలంగాణ వాదులు, ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తుంది.

అఖండ మెజార్టీతో ఢిల్లీ సర్కార్‌ కొలువుదీరిన తర్వాత మొదటిసారిగా రైల్వే, సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వీటిలోనూ కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపింది. ఆంధ్రపై ‘తల్లి’ప్రేమ.. తెలంగాణపై సవతి ప్రేమ కనిపించింది. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. కనీసం సర్వేలు పూర్తయిన ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించలేదని ఆరోపణలు వచ్చాయి.  సాధారణ బడ్జెట్‌లో ఏపీకి వరాలు కురిపిస్తూ తెలంగాణకు ఒక ఉద్యానవన యూనివర్సిటీ మాత్రమే కేటాయించడం కేంద్రం వివక్ష చూపిన తీరుకు అద్దం పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం 14 ప్రాజెక్టులను కోరితే కేవలం ఒక్కటి మాత్రమే కేటాయించారు. ఆంధ్రకు ఎనిమిది ప్రాజెక్టులిచ్చారు. ఎయిమ్స్‌, ఐఐటీ, కారిడార్‌లు, వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు పలు కేటాయింపులు జరిగాయి. రెండు కొత్త రాష్ట్రాలైనప్పుడు సమన్యాయం చేయాల్సిన ‘పెద్ద’ ఇలా ఒకవైపే మొగ్గు చూపడం సరికాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కృష్ణ నది నీటి పంపకాల్లోనూ, విద్యుత్తు పిపిఏ రద్దు విషయంలోనూ, రెండు రాష్ట్రాల ఉద్యోగుల ఎంపికలోనూ వివాదాలు తలెత్తాయి. వీటంన్నింటినీ సామరస్యంగా పరష్కరించాల్సింది కేంద్రమే. మరి కేంద్రం ఓ ప్రాంతం వైపే మొగ్గు చూపడం, మరో ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం స్పష్టంగా కనిపిస్తున్న ఈ తరుణంలో వీటి పరిష్కారం ఎలా జరుగుతుందో చూడాలి. మరో వైపు కేంద్రం తీరుపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీలు గోడం నగేశ్‌, బూర నర్సయ్య గౌడ్‌ పేర్కొన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో ప్రకటించిన రైల్వేలైన్‌ సర్వేలు, ప్రాజెక్టుల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. రైల్వే కేటాయింపు, బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని  అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని మండిపడ్డారు. పోలవరం ముంపు గ్రామాలను,  విద్యుత్తు అందించే సీలేరు విద్యుత్‌ కేంద్రాన్ని ఆంధ్రాలో కలపడం దారుణమని అన్నారు. రాజ్యసభలో పోలవరం బిల్లు ఆమోదం పొందిన తీరు బాధాకరమని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు వెంకయ్యనాయుడు, చంద్రబాబు అడ్డుపడ్డారు. ఇప్పుడు పోలవరం ముంపు గ్రామాలతోపాటు ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేసిన సవరణ బిల్లుతో తెలంగాణకు ఒక కాలు తీసేసినంత పనైందన్నారు. ప్రజల నిరసనలు పట్టించుకోకుండా బిల్లును ఆమోదించడం గిరిజనుల తలలు నరకడం వంటిదేనని విమర్శించారు.  భాజపా, తెదేపాలతో కాంగ్రెస్‌ కుమ్మక్కవడం దుర్మార్గం. వైకాపా తన వైఖరేంటో తేల్చుకోవాలి. కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ తెలంగాణకు హైదరాబాద్‌ ఎంత ప్రాధాన్యమైందో ఆంధ్రకు పోలవరం అంతటిదంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గిరిజనుల హక్కుల సాధనకు సుప్రీంకోర్టులో కేసు వేస్తామన్నారు. ఆంధప్రదేశ్‌ పునర్విభజన చట్టం సవరణ బిల్లు ద్వారా తెదేపా, భాజపాలు తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టాయన్నారు. మేం పోలవరం డిజైన్‌లో మార్పు మాత్రమే కోరాం. అయినా పెడచెవిన పెట్టి ఏడు మండలాలను ఏపీలో కలపడం దారుణం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబుల కుట్ర ఫలితమే  రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌, భాజపా, తెదేపా నేతల నిర్లక్ష్యం కూడా దీనికి కారణం. తెలంగాణ ప్రజలు వారిని ఎప్పటికీ క్షమించరన్నారు.