మన హైదరాబాద్ ఇక డిజిటల్ సిటీ
పెట్టుబడులకు మన నగరమే సురక్షితం
పారిశ్రామికవేత్తలకు సీఎం కేసీఆర్ ప్రోత్సాహకాలు
హైదరాబాద్, జూలై 15 (జనంసాక్షి) :
మన హైదరాబాద్ ఇక డిజిటల్ సిటీగా రూపాంతరం చెందనుంది. హైదరాబాద్ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రెండు మూడు వారాల్లోనే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసేలా నూతన పారిశ్రామిక విధానం ఉంటుందని చెప్పారు. పారిశ్రామికవేత్తలు అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారు నేరుగా వచ్చి నన్నే కలువవచ్చన్నారు. మంగళవారం నానక్‌రాంగూడలోని వేవ్ రాక్ ఐటీ పార్కును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్ ఆలవాలం కావాలని ఆకాంక్షించారు. ఐటీ రంగానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. హైదరాబాద్‌ను డిజిటల్ సిటీగా మారుస్తామని స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతుందన్నారు. హైదరాబాద్ బ్రాండ్, తెలంగాణ బ్రాండ్‌ను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేసీఆర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. తక్కవు వ్యవధిలోనే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని అనుమతులు మంజూరు చేసేలా చూస్తామన్నారు. హైదరాబాద్‌లో దిగిన పారిశ్రామికవేత్తలకు అధికారులు విమానాశ్రయంలో స్వాగతం పలికి నేరుగా సీఎం కార్యాలయానికి తీసుకువస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉండే సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. పరిశ్రమలకు రెండు మూడు వారాల్లో అనుమతులు వచ్చేలా చూస్తామని తెలిపారు. ఈ మేరకు పారిశ్రామిక విధానానికి తమ ప్రభుత్వం రూపకల్పన చేస్తోందన్నారు. పారిశ్రామిక పెట్టుబడులు ఆహ్వానించేందుకు సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకువస్తామన్నారు. అనుమతుల కోసం ఇన్వెస్టర్లు కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు పారిశ్రామిక వేత్తలు కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూస్తామన్నారు. అనుమతుల మంజూరు విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తామన్నారు. ప్రజలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో పౌర భద్రతకు అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.