వేద్‌ప్రకాశ్‌, సయీద్‌ భేటీ వ్యవహారంపై ఉభయ సభల్లో రగడ

111222

వైదిక్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత : రాహుల్‌

న్యూఢిల్లీ, జూలై 15 (జనంసాక్షి) :

జర్నలిస్టు వేదప్రకాశ్‌ వైదిక్‌, ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌తో భేటీ వ్యవహారం వరుసగా రెండోరోజూ పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. మంగళవారం లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. హఫీజ్‌-వైదిక్‌ భేటీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే, ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ వ్యవహారం సద్దుమణగలేదు. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. మంగళవారం ఉదయం లోక్‌సభ, రాజ్యసభ సమావేశం కాగానే విపక్షాలు వైదిక్‌ వ్యవహారాన్ని లేవనెత్తాయి. భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది అయిన హఫీజ్‌ సయీద్‌తో భేటీ కావడంపై చర్చ జరపాలని పట్టుబట్టాయి. సమస్య తీవ్రతను గుర్తించి ప్రశ్నోత్తరాలు రద్దు చేసి చర్చించాలని డిమాండ్‌ చేశాయి. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, బీజేడీ, వామపక్షాలు సభను అడ్డుకున్నాయి. కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదాపడ్డాయి. వాయిదా అనంతరం సమావేశమైన రాజ్యసభలో ఆందోళనలు మిన్నంటాయి. కచ్చితంగా ఈ అంశంపై చర్చించాల్సిందేనని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను వైదిక్‌ కలవడంపై ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఎంబసీ ప్రమేయం లేకుండానే వీరిద్దరి మధ్య భేటీ జరిగిందా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు దేశ భద్రతకు ప్రమాదకరమని హెచ్చరించారు. దీనిపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమాధానమిస్తూ వేదప్రతాప్‌ వైదిక్‌ పాక్‌ పర్యటనకు గానీ, సయీద్‌తో భేటీకి గానీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సమాధానంపై సంతృప్తి చెందని విపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. దీంతో సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభలోనూ విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. ఈ వివాదంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ సభకు వివరణ ఇచ్చారు. ఈ భేటీ వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందన్న విపక్షాల ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ అయిన ఉగ్రవాదితో ఓ జర్నలిస్టు కలవడం వెనుక ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని తెలిపారు. ప్రభుత్వంపై ఆరోపణలు అవాస్తవం, నిరాధారమని కొట్టిపడేశారు. పాక్‌ యాత్ర, హఫీజ్‌తో సమావేశం పూర్తిగా వైదిక్‌ వ్యక్తిగతమన్నారు. జర్నలిస్టు వేదప్రతాప్‌ వైదిక్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. పాక్‌ పర్యటనలో వైదిక్‌ సయీద్‌ను కలవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై విపక్షాలు పార్లమెంట్‌ను స్తంభింపజేశాయి. ఈ నేపథ్యంలో వివాదంపై రాహుల్‌గాంధీ కూడా మంగళవారం స్పందించారు. వైదిక్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి అని అభివర్ణించారు. ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌తో వైదిక్‌ సమావేశానికి ఇస్లామాబాద్‌లోని భారత్‌ రాయబార కార్యాలయం సహకరించిందా? అని ఆయన ప్రశ్నించారు. ‘ఆ పెద్ద మనిషి (వైదిక్‌)కి భారత ఎంబసీ సహాయం చేసిందా? లేదా? ఈ సమావేశానికి ఎంబసీ అనుమతి ఉందా? అన్నదే తెలుసుకోవాలన్న కుతుహలం ఉందని’ వ్యాఖ్యానించారు. ఒకవేళ హైకమిషన్‌ సాయం చేసి ఉంటే ఉత్కంఠకు తావుండదన్నారు. వైదిక్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి అని అందరికీ తెలిసిందేనని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మరోవైపు, ఈ భేటీ వెనుక ప్రధాని కార్యాలయం హస్తం ఉందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రభుత్వ ప్రమేయం లేకుండా సమావేశం ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. ఇదిలా ఉంటే, తన భేటీపై వివాదం రేగిన నేపథ్యంలో వైదిక్‌ స్పందించారు. హఫీజ్‌ను కలిసేందుకు ఓ పాకిస్తాన్‌ జర్నలిస్టు సహకరించారని వెల్లడించారు. తనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ ఆరోపణలను తిప్పికొట్టారు. బీజేపీ నేతల కంటే తనకు కాంగ్రెస్‌ నేతలే ఎక్కువ తెలుసని స్పష్టం చేశారు.