గవర్నర్‌ అధికారాలు సహించం

1

– కేంద్రంపై జాతీయ స్థాయిలో యుద్ధం ప్రకటిస్తా

– దేశంలోని ముఖ్యమంత్రులను ఏకం చేస్తాం

– మా అధికారాల దురక్రమణే

– ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, జులై16 (జనంసాక్షి): ఉమ్మడి రాజధాని పేరుతో హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టాలని చూస్తే సహించబోమని, అది తెలంగాణపై దురాక్రమణేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. రాష్ట్రం అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. దీనిపై దేశంలోని ముఖ్యమంత్రులను అందరినీ ఏకం చేసి కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ దిశగా ప్రోత్సహిస్తున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. తెలంగాణ బిడ్డల ఫీజులు మాత్రమే చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఏపీకి చెందిన విద్యార్థులకు అక్కడి ప్రభుత్వమే ఫీజులు చెల్లించుకోవాలని తేల్చిచెప్పారు. 1.50 లక్షల కోట్లతో రాజధాని నగరం నిర్మించుకోగలిగిన వాళ్లు విద్యార్థుల ఫీజులు కట్టుకోలేరా అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ, చంద్రబాబుతో తెలంగాణ ప్రభుత్వ సంబంధాలు ఎలా ఉంటాయని విలేకరులు ప్రశ్నించగా బదులిస్తూ మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మాదిరిగానే ఏపీ తమకు సరిహద్దు రాష్ట్రమని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాదిరిగానే ఏపీ సీఎంతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తామని అన్నారు.