ఉక్రెయిన్‌లో కుప్పకూలిన మలేషియా విమానం
295 మంది మృతి
క్షిపణి దాడిగా అనుమానం?
కీవ్/కౌలాలంపూర్, జూలై 17 (జనంసాక్షి) :
మలేషియాను విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ప్రయాణికులతో చైనా రాజధాని బీజింగ్‌కు బయల్దేరిన బోయింగ్ విమానం జాడ తెలియకుండా పోయిన ఘటనను మరిచిపోకముందే మరో విమానం కుప్పకూలి అందులో ప్రయాణిస్తున్న వారంతా మృత్యువాతపడ్డారు. అయితే జాడ తెలియకుండా పోయిన విమానం, కూలిపోయిన విమానం రెండూ బోయింగ్ విమానాలే కావడం గమనార్హం. మలేషియా, ఉక్రెయిన్ దేశాల రక్షణ వర్గాల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నెదర్లాండ్స్ రాజధాని అమ్‌స్టర్‌డాం నుంచి మలేషియాకు వస్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం ఎంహెచ్ 17 ఉక్రెయిన్ శివారుల్లో గురువారం కూలిపోయింది. అయితే ఈ విమానాన్ని ఉగ్రవాదులు క్షిపణి దాడులతో కూల్చివేశారని అనుమానిస్తున్నారు. ఈ విమానంలో ప్రయాణికులు 280 మంది అధికారులు 15 మంది ఉండగా వారంతా మృతిచెందినట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. ప్రమాద స్థలంలో విమాన శకలాలతో పాటు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని బట్టి ఇది ఉగ్రవాదుల కుట్రగానే తేల్చిచెప్తున్నారు. విమానం ఉక్రెయిన్‌లోని డొనెస్టక్ ప్రాంతం గుండా వెళ్తుండగా ఉగ్రవాదులు ప్రయోగించిన క్షిపణి దానిని పేల్చివేసినట్టు ఉక్రెయిన్ వర్గాలు ప్రకటించాయి. గత కొద్దికాలంగా ఈ ప్రాంతంలో పలుమార్లు ఉగ్రవాదులు క్షిపణి దాడులకు పాల్పడుతున్న విషయాన్ని ఉక్రెయిన్ అధికారవర్గాలు గుర్తు చేశాయి. రష్యా అనుకూల వ్యతిరేక వర్గాలతో ఉక్రెయిన్ అట్టుడుకుతోంది. ఇటీవల కాలంలో ఈ రెండు వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఈ ప్రాంత వాసులు భయంభయంగా బతుకులీడుస్తున్నారు. ఈనేపథ్యంలో డొనెస్టెక్ ప్రాంతంలో విమానం కూలిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రిమిచా రష్యాలో విలీనం అయిన అనంతరం డొనెస్టిక్ ప్రాంతం కూడా రష్యాలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో ఉక్రెయిన్ దళాలకు, డొనెస్టిక్‌వాదులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో డొనెస్టిక్‌వాదులు క్షిపణి దాడికి పాల్పడినట్టు ఉక్రెయిన్ రక్షణ వర్గాలు వెల్లడించాయి. విమానం పదివేల అడుగుల ఎత్తులో ఉండగా భూ ఉపరితలం నుంచి ఉగ్రవాదులు క్షిపణి ప్రయోగించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఆ కాసేపటికే విమానంతో ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ సంబంధాలు తెగిపోయాయి. ఈ విమాన ప్రమాదంపై ఉక్రెయిన్ విచారణకు ఆదేశించినట్లు హోం మంత్రి ఆన్టోన్ తెలిపారు. విమానంలో ఉన్నవారంతా మృతిచెందినట్లుగా ఉక్రెయిన్ వర్గాలు ప్రకటించాయి. అయితే ప్రమాద ఘటనను రష్యా వార్తాసంస్థ ఇంటర్‌ఫాక్స్ బాహ్య ప్రపంచానికి తెలిపింది. ఆ తర్వాత మలేషియన్ ఎయిర్‌లైన్స్ దీనిని నిర్దారించింది. ఉక్రెయిన్‌లో తమ దేశానికి చెందిన విమానం కూలిపోవడంపై మలేషియా ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. విమానం కూలిపోయిన పరిసర ప్రాంతాల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12.14 గంటలకు అమ్‌స్టర్‌డాంలో బయల్దేరిన విమానం శుక్రవారం ఉదయం 6.10 గంటలకు కౌలలంపూర్‌కు చేరుకోవాల్సి ఉంది. విమాన ప్రమాదంపై ప్రయాణికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఎవరూ బతికి బట్టే అవకాశం లేకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి.