తెలంగాణాకు ఎట్టకేలకు ఓ వరాన్ని విదిల్చిన కేంద్రం

2
థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం

న్యూఢిల్లీ, జూలై 17 (జనంసాక్షి) :

కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తెలంగాణకు ఒకవరాన్ని విదిల్చింది. తెలంగాణలో నాలుగు వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలో ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గురువారం లోక్‌సభలో ప్రకటించింది. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణలో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి 4 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొంది. అయితే, దీనిపై ఇటీవలి సాధారణ బడ్జెట్‌లో కేంద్రం ప్రస్తావించలేదు. ప్రాజెక్టు ఏర్పాటుకు ఎంత మేరకు నిధులు కేటాయిస్తున్నది పేర్కొనలేదు. దీనిపై వరంగల్‌ ఎంపీ కడియం శ్రీహరి గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టంలో కేంద్రం హావిూ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే, ఇటీవలి సాధారణ బడ్జెట్‌లో దీనిని అసలు ప్రస్తావించనే లేదని తెలిపారు. ఆ హామీ అమలుకు ఏయే చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో బొగ్గు, నీరు, స్థలం అందుబాటులో ఉందని ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలని అడిగారు. దీనిపై కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ ఘోయల్‌ సభకు సమాధానమిచ్చారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా తెలంగాణలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు తాము సుముఖంగా ఉన్నామని తెలిపారు. దీనిపై ఇప్పటికే దృష్టి సారించామని చెప్పారు. బొగ్గు కేటాయింపులు, ఇతర అంశాలపై సమీక్షిస్తున్నామని అవన్నీ పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్‌ నిర్మాణానికి బిడ్డింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు.