ఘనంగా మన గోదావరి పుష్కరాలు

1

రాష్ట్రపతిచే ప్రారంభిద్దాం

కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిద్దాం : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి) :

మన గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలోని సీ బ్లాక్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఏర్పాట్లన్ని విస్తారంగా ఉండాలని నిర్ణయించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని పుష్కరాల ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఇబ్బంది పడకుండా చూడాలని, అందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. పుష్కరాలకు రాష్ట్రపతిని ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. పుష్కర పద్ధతుల అవగాహనకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో సిద్ధాంతులు జగద్గురు శంకరాచార్యుల వద్దకు వెళ్లాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఇందులో భాగంగా శృంగేరి, కంచి పీఠాధిపతులను, తదిరత ఆధ్యాత్మిక గురువులను పిలిచి పుష్కరాలను ఘనంగా జరపాలని తీర్మానించారు. పీఠాధిపతులను ఆహ్వానించడానికి సలహాదారు రమణాచారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సచివాలయంలో దేవాదాయ శాఖ, రాష్ట్ర ఉన్నతాధికారులతో గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జులై 14 నుంచి జరగబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అవసరమైన ఏర్పాట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2015 జులై 14 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు శృంగేరి, కంచి పీఠాధిపతులతో పాటు చిన్నజీయర్‌ స్వామి లాంటి ఆధ్యాత్మిక గురువులను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. పుష్కరాల సందర్భంగా గోదవరి పుణ్య స్నానాలకు వెళ్లేవారికి రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పుష్కర ఘట్టాల దగ్గరలో ఉన్న దేవాలయాలకు మరమ్మత్తులు చేయించాలని అధికారులకు సీఎం సూచించారు. ముంబై, భీవాండి, సోలాపూర్‌, సూరత్‌ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ ప్రజలను పుష్కరాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సీఎం కోరారు. పుష్కర తీర్థాల అధ్యయనం కోసం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యుల దగ్గరికి ఒక బృందం వెళ్లాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచన చేశారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి నేతృత్వంలో కేసీఆర్‌ గురువులు మృత్యుంజయశర్మ, పాలకుర్తి నృహింహాసిద్ధాంతి, యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, అష్టకాల రామ్మోహన్‌ శర్మ తదితరులు శృంగేరి పీఠానికి వెళ్లాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఉత్తర భారత దేశంలో కూడా గోదావరి పుష్కరాల గురించి విరివిగా ప్రచారం చేయాలని అధికారులను సూచించారు. గోదావరి పుష్కరాల వెబ్‌సైట్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రెండు కోట్లకు పైగా భక్తులు పుష్కరాల్లో పాల్గొనే నేపథ్యంలో పటిష్టమైన రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఉత్తర భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా జరిగే కుంభమేళ నిర్వహించే అర్చకులతో విడిగా సమావేశం అవుతానని అధికారులకు సీఎం తెలిపారు. పుష్కరాలకు రాష్ట్రపతితో పాటు ఇతర రాష్ట్రాల గవర్నర్లు, ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.