విమానాన్ని కూల్చింది తిరుగుబాటుదారులే : ఎస్‌బీయూ
మలేషియా విమానంలో భారతీయులెవరూ లేరు : అశోక్ గజపతిరాజు
ప్రధాని మోడీ సంతాపం
కీవ్/న్యూఢిల్లీ, జూలై 18 (జనంసాక్షి) :
మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్-777 విమానాన్ని కూల్చింది ఉక్రెయిన్ తిరుగుబాటుదారులేనని భద్రతా విభాగం (ఎస్‌బీయూ) తెలిపింది. రష్యా సైనిక నిఘా విభాగం అధికారులకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల ద్వారా తమకీ విషయం తెలిసిందని ఎస్‌బీయూ వెల్లడించింది. విమానం కూలిపోయిన 20 నిమిషాల అనంతరం రష్యా సైనిక నిఘా అధికారి ఇగోర్ బెజ్లర్, రష్యా భద్రతాధిరాని వాసిలి జెరానిక్‌కు ఫోన్ చేశారని పేర్కొంది. ‘దినెస్క్ ప్రాంతంలో విమానాన్ని ఇప్పుడే కూల్చివేశాం’ అని జెరానిన్‌కు బెజ్లర్ ఫోన్‌లో తెలిపాడని వెల్లడించింది. బెజ్లర్ దినొస్క్ పీపుల్స్ రిపబ్లిక్ సంస్థకు స్వయం ప్రకటిత కమాండర్. మేజర్, గ్రీక్ పేరుతో ఇద్దరు తీవ్రవాదులు జరిపిన సంభాషణను కూడా ఎస్‌బీయూ విడుదల చేసింది.
కాగా కూల్చివేసిన మలేషియా విమానంలో భారతీయులు ఎవరూ ప్రయాణించలేదని పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు చెప్పారు. ఈ సంఘటన చాలా విచారకరమన్నారు. భారత విమానాలు ఉక్రెయిన్ మీదుగా ప్రయాణం చేయరాదని ఇప్పటికే అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించిన రెండు విమానాలు యూరప్, నార్త్ అమెరికాలకు వెళ్లాయని వాటిని ఉక్రెయిన్ మీదుగా కాకుండా దారి మళ్లించి ప్రయాణం చేసేలా ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు ఆయన పేర్కొన్నారు మరణించినవారిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన విమానసిబ్బంది మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో కూలిపోయిన విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఇందులోని సమాచారం ఆధారంగా విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలుసుకోనున్నారు. మరోవైపు ఉక్రెయిన్ విూదుగా విమాన రాకపోకలను విమానసంస్థలు నిలిపేశాయి. ఇదిలావుంటే విమానం కూల్చివేత ఘటనలో ఇంకా 21 మంది మృతులను గుర్తించాల్సి ఉందని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ విమానంలో ప్రయాణించి మరణించినవారిలో నెదర్లాండ్స్‌కి చెందినవారు 173 మంది, మలేసియాకు చెందినవారు 44 మంది, ఆస్ట్రేలియాకు చెందినవారు 27 మంది, ఇండోనేసియాకు చెందినవారు 12 మంది ఉన్నారని మలేషియా ప్రకటించింది. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై పేల్చేశారు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ మృతి చెందారు. మలేషియా విమాన ప్రమాదంలో మొత్తం 295 మంది మరణించారు. వారిలో ఇద్దరు భారత సంతతికి చెందిన విమాన సిబ్బంది అని తెలుస్తోంది. జన్మతః భారతీయులైన వీళ్లు మలేషియా ఎయిర్లైన్స్ సంస్థలో ఉద్యోగానికి వెళ్లి ఆ ప్రయాణంలోనే అసువులు బాశారు. ఇక మృతులలో చాలామంది ఎవరన్న విషయం తెలియడంతో వాళ్ల బంధువులకు సమాచారం అందించినట్లు మలేషియా ఎయిర్లైన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే.. 47 మంది మాత్రం ఎవరన్నది ఇంకా గుర్తించలేకపోయారు. వాళ్లు ఏ దేశానికి చెందినవాళ్లో, వాళ్ల ఊరు-పేరు ఏమిటో అనే విషయం ఖరారు కాలేదు. విమానంలో ఉన్నవారిలో మొత్తం 154 మంది డచ్ దేశస్థులు కాగా, 43 మంది మలేషియన్లు. వాళ్లలో 15 మంది విమాన సిబ్బంది. వీళ్లు కాకుండా ఇంకా 27 మంది ఆస్టేల్రియన్లు, 12 మంది ఇండోనేషియన్లు, ఆరుగురు బ్రిటిష్ వాళ్లు, నలుగురు జర్మన్లు, నలుగురు బెల్జియన్లు, ముగ్గురు ఫిలిప్పీన్స్ వాసులు, ఒక కెనడియన్ ఉన్నారు. మిగిలిన 47 మంది గురించి మాత్రం ఇంకా తెలియలేదు. మొత్తం ప్రయాణికుల్లో 100 మంది ఎయిడ్స్ పరిశోధకులు ఉన్నారు. ఓ సదస్సులో పాల్గొనడానికి వీళ్లంతా వెళ్తున్నట్లు తెలిసింది.
ప్రధాని సంతాపం : ఉక్రెయిన్‌లో ఉగ్రవాదులు పౌర విమానాన్ని కూల్చివేయడంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.