మలేషియా విమానం కూల్చివేతపై మొదలైన దర్యాప్తు
298 మృతదేహాల వెలికితీత
రష్యా, ఉక్రెయిన్ల పరస్పర ఆరోపణలు
కీవ్, జూలై 19 (జనంసాక్షి) :
మలేషియా విమాన దుర్ఘటనపై అత్యున్నత విచారణ ప్రారంభమైంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు బృందం శోధిస్తోంది. మరోవైపు, అంతర్జాతీయ స్థాయి నిష్పక్షిక దర్యాప్తునకు అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ మేరకు మిత్ర దేశాలతో కలిసి రష్యాపై ఒత్తిడి పెంచేందుకు యత్నిస్తోంది. కాగా, మలేషియా విమాన ప్రమాదంలో మృతి చెందిన 298 మంది మృతదేహాల వెలికితీత పూర్తయింది. మొత్తం 298 మందిని గుర్తించినట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. మృతుల వివరాలను శనివారం కౌలాలంపూర్‌లో ఎయిర్‌లైన్స్ విడుదల చేసింది. మృతుల్లో 192 మంది డచ్ దేశస్తులని, 15 విమాన సిబ్బంది, ఇద్దరు చిన్నారలతో సహా మొత్తం 44 మంది మలేషియన్లు ఉన్నారని తెలిపింది. ఇదిలా ఉంటే, విమాన శకలాలు కూలిన చోటుకు దర్యాప్తు అధికారులను ఉక్రెయిన్, రష్యా అనుకూల తిరుగుబాటుదారులు అంగీకరించారు. ఆ ప్రాంతాన్ని సెక్యూరిటీ జోన్‌గా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించేందుకు ఆ ప్రాంతాన్ని సెక్యూరిటీ జోన్‌గా పరిగణించేందుకు ఒప్పందం కుదిరిందని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ అధిపతి పేర్కొన్నారు. మరోవైపు తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న బ్లాక్‌బాక్స్‌లను అప్పగించాలని మలేషియా ప్రభుత్వం కోరింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న రష్యా అనుకూల తిరుగుబాటుదారులు బ్లాక్‌బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని రష్యాకు అప్పగించాలని యోచిస్తున్నారు. అయితే, దుర్ఘటనకు గల కారణాలను విశ్లేషించే బ్లాక్‌బాక్స్ దర్యాప్తుకు కీలకమైనందున దాన్ని అప్పగించాలని మలేషియా, ఉక్రెయిన్ కోరుతున్నాయి. ఇదిలా ఉంటే, దుర్ఘటనపై ఉక్రయిన్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలని రష్యా డిమాండ్ చేసింది. ఆ దేశంలో జరిగిన ప్రమాదానికి తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. తమపై ఆరోపణలు మానేసి దుర్ఘటనకు ఉక్రెయిన్ బాధ్యత వహించాలని సూచించింది.