ప్రతి పల్లెకూ ఎర్రబస్సు

2

బెహతరీన్‌ ఆర్టీసీకి బృహత్‌ ప్రణాళిక

ముంబైకి స్టడీ టూర్‌

బస్సు చార్జీలు పెరగవు : మంత్రి మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి) :

రాష్ట్రంలోని ప్రతి పల్లెకూ ఆర్డినరీ బస్సు నడిపిస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ నిర్వహణ, నష్టాల నివారణ, మెరుగైన పనితీరు కోసం వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగస్టు 5, 6 తేదీల్లో ముంబైలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం పర్యటించనుంది. ముంబైలో అందరికీ అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఈ బృందం అక్కడి విధానాలను పరిశీలించనుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిచేందుకు, బస్సుల సమయ పాలన, ఆర్టీసీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ బృందం దృష్టి సారించనుంది. ప్రజా రవాణా వ్యవస్థపై అధ్యయనం కోసం వచ్చే నెల 5, 6 తేదీల్లో ముంబైలో పర్యటించనున్నట్లు మంత్రి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్‌లోనూ ముంబై తరహా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఎక్కడికైనా ఐదు నిమిషాల్లో బస్సు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల బస్‌పాస్‌లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌దే తుది నిర్ణయమని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని గ్రామాలకు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రహదారుల సౌకర్యం లేని 1300 గ్రామాలకు రోడ్లు వేయడంతో పాటు బస్సులు నడుపుతామన్నారు. ప్రజలందరికీ రవాణా సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మూడు నాలుగు నెలల్లో కొత్త వోల్వో బస్సులు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. మొత్తం 180 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. ఇందులో హైదరాబాద్‌ జోన్‌కు 80, వరంగల్‌ జోన్‌కు 30, కరీంనగర్‌ జోన్‌కు 20 వోల్వో బస్సులు అందించనున్నట్లు తెలిపారు. బస్సు చార్జీలు పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలపై భారం మోపాలని భావించడం లేదని చెప్పారు. ఆర్టీసీ రోజుకు రూ.2 కోట్ల నష్టాల్లో ఉందని రూ.10 కోట్ల ఆదాయం వస్తే రూ.12 కోట్ల మేర వ్యయమవుతోందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలతో పోల్చితే తెలంగాణలోనే రవాణా చార్జీలు తక్కువ అని తెలిపారు. మంచి నిర్వహణ, మెరుగైన ప్రదర్శనతోనే ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కిస్తామన్నారు. ప్రైవేట్‌ బస్సులపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న బస్సులపై కఠిన చర్యలు తప్పవని హెరించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఏపీ ట్రావేల్స్‌ బస్సులపై చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఏపీ ట్రావెల్స్‌ బస్సులను రద్దు చేస్తామన్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తెలంగాణ బస్సు ఆపరేటర్లను ప్రోత్సహిస్తమన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సహకార రుణాల బకాయిలను చెల్లిస్తామని విలేకరుల అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. త్వరలోనే ఆర్టీసీ విభజనపై నిర్ణయం తీసుకుంటామని.. విభజనను వేగవంతం చేయాలని యూనియన్లు కోరుతున్నాయని తెలిపారు. ఆర్టీసీ, పోలీసుల పనితీరుపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.