‘విూ-సేవ’లో పాస్‌పోర్ట్‌ సేవలు

విశాఖపట్నం: ఇకనుంచి పాస్‌పోర్ట్‌ సేవల్ని ‘విూ సేవ’ కేంద్రాల్లో పొందవచ్చని పాస్‌పోర్ట్‌ అధికారి ఎన్‌.ఎల్‌.పి.చౌదరి చెప్పారు. ఇందుకోసం ముందుగా విూ సేవ కేంద్రాల ప్రతినిధులకు శిక్షణ ఇస్తామన్నారు. విశాఖపట్నంలోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో శనివారం విూ సేవ కేంద్రాల ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  విలేకరులతో మాట్లాడారు.

బ్యాంకులో ఖాతా తెరవడంతో పోలిస్తే పాస్‌పోర్ట్‌ పొందడం సులభమని చెప్పారు. పాస్‌పోర్ట్‌ సేవలు ప్రజలకు మరింత దగ్గరగా చేర్చడానికి విూ సేవలకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలిపారు. దళారీల నియంత్రణకు సేవలు విస్తృతం చేస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 1.37 లక్షల విూ సేవ కేంద్రాలుండగా రాష్ట్రంలో 3,600 కేంద్రాలున్నాయని తెలిపారు.

విూ సేవలో రూ.100  చెల్లించి పాస్‌పోర్ట్‌ సేవలు పొందవచ్చని, దరఖాస్తు పూర్తిచేయడం, అప్‌లోడ్‌, ఫీజు చెల్లించడంతో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని చెప్పారు. త్వరలో పోస్టాఫీసుల్లో కూడా పాస్‌పోర్టు సేవలు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.