వెంట్రుకవాసిలో తప్పిన పెనుప్రమాదం
ఆ విమానం వెనుక మన విమానం 90 సెకండ్ల దూరంలో
ఉక్రెయిన్లే కూల్చారు : జాన్‌కెర్రీ
మృతదేహాలను తిరుగుబాటుదారులే తీసుకెళ్లారు : ఉక్రెయిన్
కీవ్/న్యూఢిల్లీ, జూలై 20 (జనంసాక్షి) ం
ఉక్రెయిన్‌లో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానాన్ని రాకెట్ లాంచర్లతో కూల్చిన ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. రష్యా అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య రగులుతున్న కార్చిచ్చుతో ఏ సంబంధమూ లేని 298 మంది అమాయకులు బలైపోయారు. అయితే మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి వెనుకే మన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఉన్నట్టుగా సమాచారం. మలేషియా విమానం ఎంహెచ్-777కు వెనకాల కేవలం 90 సెకండ్ల దూరంలోనే భారత విమాన ప్రయాణిస్తోందని వార్తా కథనాలు ప్రసారమవడంతో మనోళ్లకు వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పిపోయిందని భారతీయులందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఢిల్లీ నుంచి బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన మలేషియా విమానానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉందని, డ్రీమ్‌లైనర్ విమానాన్ని 90 సెకన్లలో అధిగమిస్తుందని ఎయిర్ ఇండియాకు చెందిన అధికారులు విశ్వసనీయంగా చెప్పిన సమాచారం లీక్ అయింది. అంత దగ్గరగా ఉన్నందువల్లే ఉక్రేనియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎయిర్ ఇండియా పైలెట్‌కు ఫోన్ చేసి మలేషియా విమానం పైలెట్‌తో మాట్లాడని కోరినట్లుగా సమాచారం. మలేషియా విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కాల్స్‌కి స్పందించకపోవడంతో వాళ్లు ఎయిర్ ఇండియా పైలెట్‌తో మాట్లాడినట్టుగా తెలిసింది. మలేషియా విమానం కూల్చివేతకు కొద్ది క్షణాల ముందు కూడా ఆ విమానానికి కంట్రోలర్ ఇస్తున్న సూచనలను ఎయిర్ ఇండియా పైలెట్లు విన్నట్లుగా సమాచారం. అయితే ఈ కథనాలను ఎయిర్ ఇండియా కొట్టిపారేసింది. పౌరవిమానయాన శాఖ అధికారులు కూడా ఈ వార్తల్లో నిజం లేదని తెలిపారు. మలేషియా విమానం ఎంహెచ్-777ను ఉక్రెయిన్ వేర్పాటువాదులే కూల్చేసి ఉంటారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి జాన్‌కెర్రీ సందేహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా రష్యా నుంచి ఉక్రెయిన్ వేర్పాటువాదులకు భారీగా ఆయుధాలు అందాయని ఆయన తెలిపారు. గత జూన్‌లోనే 12 ఉక్రెయిన్ సైనిక విమానాలను వేర్పాటువాదులు కూల్చివేసినట్టు ఆయన పేర్కొన్నారు.
మలేషియా ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంలో గుర్తించిన 196 మృతదేహాలను వేర్పాటువాదులు తీసుకెళ్లారని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈమేరకు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మృతదేహాలను వారు ఎక్కడికి తీసుకెళ్లారో తమకు తెలియని పేర్కొంది. వేర్పాటువాదులు శనివారం మృతదేహాలను సంచుల్లో పెట్టుకొని ట్రక్కులో తీసుకెళ్లడాన్ని అసోసియేటెడ్ ప్రెస్ పాత్రికేయులు చూశారని సమాచారం. ఆదివారం పాత్రికేయులు మళ్లీ అదే ప్రాంతానికి వెళ్లి చూడగా అక్కడ మృతదేహాలేవి కనిపించలేదు. ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం మృతదేహాల ఆచూకీ తెలుసుకునేందుకు అన్వేషణ కొనసాగిస్తోంది.