తెగిపోయిన బంధం
కశ్మీర్‌లో ఎన్సీ, కాంగ్రెస్ విడాకులు
ఒంటరిగానే పోటీ చేస్తాం : ఒమర్, అంబికాసోని
న్యూఢిల్లీ/కశ్మీర్, జూలై 20 (జనంసాక్షి) :
జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్‌ల మధ్య బంధం తెగిపోయింది. సుదీర్ఘకాలంగా ఈ రెండు పార్టీల మధ్య ఉన్న ఎన్నికల అవగాహన తెరపడింది. త్వరలో జరుగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీ చేసేందుకు నిర్ణయించాయి. ఈమేరకు ఆదివారం రెండు పార్టీలు వేర్వేరుగా ప్రకటించాయి. పార్టీ నాయకత్వంతో పలు దఫాలుగా చర్చించన తర్వాత ఒంటరిపోరుకే సిద్ధమైనట్లు జమ్మూకశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి అంబికాసోని తెలిపారు. ఆమె ఈ విషయాన్ని మీడియా సమావేశంలోనూ ధ్రువీకరించారు. 87 శాసనసభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. జమ్మూకశ్మీర్ శాసనసభ గడువు వచ్చే యేడాది జనవరితో ముగియనుంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు దారుణ పరాభవాన్ని చవిచూశాయి. ఈనేపథ్యంలో ఒంటరిపోరు ద్వారానే సత్తా చాటుకోవాలని ఉవ్విలూరుతున్నాయి. ఒంటరిపోరుపై అంబికాసోని ప్రకటన చేసిన కొద్దిసేపటికే జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో స్పందించారు. తాము కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పది రోజుల క్రితం ట్వీట్ చేసిన అనంతరం ఇరు పార్టీలు ఒంటరిపోరాటానికి సన్నద్ధమయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో నవంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ముందే చెప్పినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. పది రోజుల క్రితం తాను సోనియాగాంధీతో సమావేశమయ్యానని, ఇంతవవరకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.