గాజాలో కొనసాగుతున్న ఎయిర్ బాంబింగ్
410కి చేరిన మృతులు
నిన్న ఒక్కరోజే 60 మంది మృతి
ఫలించని శాంతి చర్చలు
రెండు గంటల పాటే కాల్పుల విరమణ
మళ్లీ మొదలైన కాల్పులు
జెరూసలేం/గాజా, జూలై 20 (జనంసాక్షి) :
గాజాలో ఎయిర్‌బాంబింగ్ కొనసాగుతోంది. ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య పోరాటంలో సామాన్యులు సమిధలువుతన్నారు. ఇప్పటి వరకు గాజా 410 మంది సామాన్యులు మృతిచెందారు. శనివారం ఒక్కరోజే బాంబుల దాటికి 60 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో అత్యధికులు చిన్నపిల్లలు, మహిళలే కావడం గమనార్హం. హమాస్ మిలిటెంట్లను సాకుగా చూపుతూ పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాధినేతలు శాంతి నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వడం లేదు. వారి మధ్య వర్తిత్వంలో చర్చలు సాగుతున్నా అంతగా సానుకూల పరిణామాలేవి చోటు చేసుకోలేదు. మరోవైపు గాజా భూభాగంలో ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. మరోవైపు హమాస్ మిలిటెంట్లు ఆత్మాహుతి దళాలతో ఇజ్రాయెల్ సేనలపై తిరుగుబాటు దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో 373 మంది పాలస్తీనియన్లు, ఏడుగురు ఇజ్రాయెలీలు మరణించారు. అంతర్జాతీయ పెద్దల ఒత్తిడి మేరకు గాజాలోని షుజాయాలో రెండు గంటల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్లు అంగీకరించారు. శనివారం పెద్ద సంఖ్యలో సామాన్యులు మృత్యువాతపడిన నేపథ్యంలో రెడ్‌క్రాస్ ప్రతిపాదనల మేరకు ఇరు వర్గాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపాయి.