కట్జు వ్యాఖ్యలు.. లోక్‌సభలో దుమారం
రెండుసార్లు సభ వాయిదా
న్యూఢిల్లీ, జులై 22 (జనంసాక్షి): కట్జూ వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం రేగింది. న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియం విధానాన్ని మరోసారి సమీక్షిస్తామని ఎన్డీయే ప్రభుత్వం చేసిన ప్రకటనపై విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ మంగళవారం లోక్‌సభలో వివరణ ఇచ్చారు. జాతీయ జ్యూషియల్ కమిషన్ ఏర్పాటుచేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. కట్జూ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలంటూ అన్నాడిఎంకే ఎంపీలు సభలో నినాదాలు చేశారు. ప్రతిపక్షాలను నియంత్రించేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఢిల్లీలో మణిపూర్ యువకుడు హత్య గురించి ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతుండగానే తమిళ ఎంపీలు నినాదాలు చేశారు. కట్జూ ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని అన్నాడిఎంకే ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ రెండు సార్లు వాయిదా పడింది.
కొలీజియం విధానాన్ని సమీక్షించాలని భావిస్తున్న కేంద్రం
న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు రిటైడ్ జడ్జి మార్కండేయ కట్జూ రేపిన వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. అధికార ఎన్డీయే ప్రభుత్వం ఏకంగా కొలీజియం విధానాన్ని సవిూక్షించాలని తలపెట్టింది. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం అమలులో ఉన్న కొలీజియం విధానాన్ని సమీక్షించాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. మద్రాస్ హైకోర్టుకు చెందిన ఒక అదనపు జడ్జీ నియామకంపై మార్కండేయ కట్జూ చేసిన ఆరోపణలు మొత్తం వ్యవస్థనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ జోక్యాన్ని జస్టిస్ కట్జూ బట్టబయలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ముగ్గురిపై కట్జూ ఆరోపణలు చేశారు. కట్జూ ఆరోపణలు చేసిన వివాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ప్రముఖ న్యాయవాదులు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులను ఈ సమావేశానికి ఆహ్వానించింది. న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాన్ని రద్దు చేసి జ్యూడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ కూడా కేంద్రం పలువురు నిపుణులతో చర్చలు జరిపింది.