ట్యాంక్‌బండ్‌పై పనికిమాలిన విగ్రహాలు

4

ధిక్కార స్వరం దాశరథి

కలల కాణాచి తెలంగాణ

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

ఘనంగా దాశరథి జయంతి వేడుకలు

హైదరాబాద్‌, జూలై 22 (జనంసాక్షి) : ట్యాంక్‌బండ్‌పై పనికిమాలిన విగ్రహాలు ఉన్నాయని వాటి స్థానంలో తెలంగాణ ప్రముఖ కవులు, సాహితీవేత్తల విగ్రహాలు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రముఖ సాహితీవేత్త దాశరథి సాహిత్య రంగానికి చేసిన సేవలు ఎనలేనవని కొనియాడారు. దాశరథి 89వ జయంతి వేడుకలు మంగళవారం రవీంద్రభారతిలో అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి చిత్రపటానికి కేసీఆర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దాశరథి స్మారక స్థూపాన్ని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌పై పనికిమాలిన విగ్రహాలు చాలా ఉన్నాయని, త్వరలో దాశరధి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అచ్చమైన తెలంగాణ బిడ్డ దాశరధి అని, ఆయన 89వ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. దాశరథి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. రెండుమూడు రోజుల్లో దాశరథి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి అని, ఎప్పుడు జీవితంలో రాజీపడలేదని అన్నారు. ప్రతిఏడాది దాశరధి పేరున తెలంగాణలోని ఉత్తమ కవులకు అవార్డుతోపాటు లక్ష రూపాయల నగదును కూడా ప్రకటిస్తామని పేర్కొన్నారు. దాశరథి పేరున ఒక యూనివర్సిటీకి లేదా విద్యాసంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. రవీంద్రభారతిని ఉత్తమ ఆడిటోరియంగా తీర్చిదిద్దుతామని అన్నారు. తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ఆయన తెలిపారు. రవీంద్రభారతిని అభివృద్ధి చేసేందుకు ప్రతి సంవత్సరం 30లక్షల నుంచి కోటి రూపాయల వరకు పెంచుతున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ఉత్తమ కవులను ప్రతి సంవత్సరం సన్మానిస్తామని సీఎం చెప్పారు.