సింగపూర్‌ తరహాలో నూతన పారిశ్రామిక విధానం

5
ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు

కాలుష్య మినహా రెండు వారాల్లో అన్ని అనుమతులు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్‌, జులై 22 (జనంసాక్షి) : సింగపూర్‌ తరహాలో నూతన పరిశ్రమల స్థాపనకు సింగిల్‌ విండో సిస్టమ్‌ను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించేందుకు మంగళవారం గ్రాండ్‌ కాకతీయ హోటల్‌లో ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. తాము చేపట్టబోయే నూతన పారిశ్రామిక విధానంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. పరిశ్రమల స్థాపనకు  కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని అన్నారు. ఒక సంతకంతో పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుమతిస్తామని తెలిపారు. సచివాలయంలోని సిఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. గతంలో పరిశ్రమలు స్థాపిస్తామని ప్రభుత్వం నుంచి వేలాది ఎకరాలు తీసుకున్న కొందరు పారిశ్రామికవేత్తలు ఆ స్థలాల్లో ఎలాంటి పరిశ్రమలు స్థాపించలేదని, ఆ భూములను ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం తాము చేపట్టబోయే పారిశ్రామిక విధానంలో తప్పులు దొర్లకుండా పరిశ్రమలు నెలకొల్పేలా పారిశ్రామికవేత్తలకు సహాయ పడతామని, పరిశ్రమలు నెలకొల్పని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్‌ను సాఫ్ట్‌వేర్‌ రంగంతో పాటు హార్డ్‌వేర్‌ రంగంలో కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. వాతావరణ నియంత్రణ బోర్డు అనుమతి తప్ప మిగిలిన అనుమతులను రెండు వారాల్లో ఇచ్చేవిధంగా చర్యలు ఉంటాయని, వీటన్నింటిని తనే స్వయంగా పర్యవేక్షిస్తానని సిఎం అన్నారు. తాము రూపొందించబోయే పారిశ్రామిక విధానం పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్‌ రంగం నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుండి విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. రాబోయే మూడేళ్ళల్లో తెలంగాణలో మిగులు విద్యుత్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని అన్నారు. హైదరాబాద్‌ నగరం చుట్టూ 220 కిలోమీటర్ల పరిధిలో మూడు లక్షల ఎకరాలలో వివిధ రకాల పరిశ్రమలు నెలకొల్పేందుకు అనువైన వాతావరణం ఉందన్నారు. అవినీతిలేని పాలనను అందిస్తామని చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహిస్తామని అన్నారు. తాము రూపొందించే నూతన పారిశ్రామిక విధానానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కేసీఆర్‌ కోరారు.