తైవాన్‌లో కుప్పకూలిన విమానం

2

51 మంది మృతి

తైపీ, జూలై 23 (జనంసాక్షి) :

వరుస విమాన ప్రమాదాలు కొనసాగుతున్నాయి. విహంగ ప్రయాణికులు భయంతో అల్లాడిపోయేలా మరో ప్రమాదం చోటు చేసుకుంది. 54 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో వెళ్తున్న తైవానీస్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ట్రాన్సేషియా ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం పెంఘు రాష్ట్రంలో మాగాంగ్‌ విమానశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ అవుతూ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 51 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈమేరకు తైవన్‌కు చెందిన సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ఒక కథనం వెలువరించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడినట్టు సదరు వార్త సంస్థ ఆ దేశా అగ్నిమాపకశాఖాధిపతిని ఉటంకిస్తూ పేర్కొంది. భారీ వర్షం కురుస్తుండటంతో విమానం ల్యాండింగ్‌కు అనుకూల పరిస్థితులు లేని కారణంగా రన్‌వే విమానం దిగడానికి ప్రయత్నించిన క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. తైవాన్‌లో మంగళవారం ఉదయం ఏర్పడిన తుపాను కారణంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తైవాన్‌ రాజధాని తైపీ నుంచి పెంఘు ద్వీపానికి వెళ్తున్న విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముందుకు వెళ్లడం సాధ్యం కాక అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించగా పెను ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఫ్లాష్‌లైట్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.