తెలంగాణలో తగ్గనున్న సిమెంట్‌ ధరలు

3
అంగీకరించిన సిమెంట్‌ కంపెనీల యజమానులు

హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్‌ ధరలు కొంతమేరకు తగ్గనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధార కార్యదర్శి రాజీవ్‌శర్మతో సిమెంట్‌ కంపెనీల యాజమాన్యాలు జరిపిన చర్చల్లో ఈమేరకు ధర తగ్గింపునకు అంగీకారం తెలిపాయి. ఈ సమావేశంలో బిల్డర్లు, సిమెంట్‌ కంపెనీల యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు. బస్తా సిమెంట్‌ ధరను రూ.25 వరకు తగ్గిస్తామని సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. 45 రోజుల క్రితం వరకు రూ.220 నుంచి రూ.230 వరకు పలికిన బస్తా సిమెంట్‌ ధర ఒక్కసారిగా వంద రూపాయలకు పైగా పెరిగింది. దీంతో కెడ్రాయ్‌ ఆధ్వర్యంలో నిర్మాణాలను సైతం నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని కాంట్రాక్టర్లు, సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ మేరకు సిమెంట్‌ ధరలు కొంతమేరకు తగ్గించనున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్మాణాలను ప్రారంభిస్తామని కెడ్రాయ్‌ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ సర్కారు తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా చొరవ చూపి సిమెంట్‌ ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.