హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా సిటీ

5

గజ్వేల్‌కు రూ.25 కోట్లు విడుదల

ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) :

నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అన్నారు. బుధవారం డ్రగ్స్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌తో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న బల్క్‌ డ్రగ్స్‌ విలువ ఏడాదికి రూ.65,168 కోట్లు ఉందని తెలిపారు. ఉత్పత్తిలో 30 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నదని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నేషనల్‌ హైవేలు, రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండే విధంగా ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 5 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా లక్ష ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఫార్మా సిటీ కోసం 500 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన ప్రత్యేక పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల డ్రగ్స్‌ ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్‌ సదుపాయం కల్పిస్తుందని ఆయన హామీనిచ్చారు. తెలంగాణలో ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హావిూయిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. బల్క్‌ డ్రగ్‌ మ్యానిఫాక్చర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో బుధవారం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రత్యేక ఫార్మా సిటీని నెలకొల్పేందుకు 5 వేల ఎకరాల స్థలం అవసరమని సీఎంకు ఫార్మా ప్రతినిధులు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం ప్రత్యేక సెక్రటరీని నియమించాలని కోరగా, దీనికి సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. ఈ సమావేశంలో బల్క్‌ డ్రగ్స్‌ మ్యానూ ఫాక్చరర్స్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ ఠాగూర్‌ పాల్గొన్నారు. వచ్చే ఏడాది లోపు రాజధాని పరిసర ప్రాంతాల్లో 7నుంచి 8 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే తన సొంత నియోజకవర్గం మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌ అభివృద్ధి మండలికి ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.