తుదిశ్వాస వరకూ భారతీయురాలినే
నిజాం కాలం నుంచే మేము తెలంగాణ బిడ్డలమే
బ్రాండ్ అంబాసిడర్‌పై వివాదం వద్దు : టెన్నిస్ స్టార్ సానియామీర్జా
హైదరాబాద్, జూలై 14 (జనంసాక్షి) :
తుదిశ్వాస విడిచే వరకూ తాను భారతీయురాలినేనని టెన్నిస్ స్టార్ సానియామీర్జా అన్నారు. నిజాం కాలంలోనే తమ కుటుంబం తెలంగాణలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుందని ఆమె పేర్కొన్నారు. తాను ఎప్పటికీ ఇండియన్‌నేనని ఈ విషయంలో వివాదం వద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. తనను తెలంగాణ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడం తనను బాధించిందని తెలిపారు. ఈ విషయంపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. తనను భారతీయురాలు కాదంటే ఒప్పుకోనని కుండబద్దలు కొట్టింది. తనపై అవుట్ సైడర్ ముద్రవేయడాన్ని ఆమె ఖండించారు. అనవసర విషయాలపై సమయం వృథా చేయకుండా దేశం, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే మంచిదని ఆమె సూచించారు. కాగా సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడాన్ని రాష్ట్ర బీజేపీ నాయకులు తప్పుబడుతుంటే.. అదే పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాత్రం ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె దేశానికి గర్వకారణమైన క్రీడాకారిణి అని అన్నారు. సానియా లాంటి టెన్నిస్ స్టార్ మనదేశంలో ఉండడం గర్వించదగ్గ విషయమని జవదేకర్ అన్నారు. మనదేశానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ టెన్నిస్‌లో స్వశక్తితో ఆమె విజయాలు సాధించిందని అన్నారు.