దేశం తరపున ఆడే నేను జాతీయతపై వివరణ ఇచ్చుకోవాలా?
కంటతడి పెట్టిన సానియామీర్జా
హైదరాబాద్, జూలై 25 (జనంసాక్షి) :
దేశం తరపున టెన్నిస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే తాను జాతీయతపై వివరణ ఇచ్చుకోవాలా అంటూ టెన్నిస్ స్టార్ సానియామీర్జా కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఎన్‌డీటీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తన జాతీయతను శంకించడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని చెప్పారు. ఎన్నిసార్లు తన భారతీయతను నిరూపించుకోవాలని, మరే దేశంలోనైనా ఇలా జరుగుతుందా అని ఆమె ప్రశ్నించారు. పెళ్లైన తర్వాత కూడా తాను భారత్ కోసమే ఆడుతున్నానని, ఎన్నో పతకాలు సాధించానని తెలిపారు. తను సిసలైన హైదరాబాదీనని, తనను అవుట్ సైడర్‌గా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. వందేళ్లకుపైగా తమ కుటుంబం హైదరాబాద్‌లోనే నివసిస్తోందని చెప్పారు. విమర్శలను పట్టించుకోబోనని, తెలంగాణ గౌరవాన్ని నిలబడెతానని ఆమె స్పష్టం చేశారు. తనను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై క్రీడాకారులెవ్వరూ అసంతృప్తితో లేరని ఆమె తెలిపారు. తన సన్నిహితురాలు, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నేహ్వాల్‌కు న్యాయం జరుగుతుందని చెప్పారు.