చేతులు కాలాక ఆకులు

3
మాసాయిపేట వద్ద గేటు ఏర్పాటు

నిద్రలేచిన రైల్వేశాఖ

మెదక్‌, జూలై 25 (జనంసాక్షి) :

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది రైల్వేశాఖ పనితీరు. 16 మంది చిన్నారులు సహా 18 మందిని బలితీసుకున్న తర్వాత మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే క్రాసింగ్‌ వద్ద హుటాహుటిన గేట్లు ఏర్పాటు చేసింది. నిన్నటివరకూ కానరాని గేట్లు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఎన్నడూ కనిపించని కాపలాదారులు కాపలా కాస్తున్నారు. గురువారం నాందెడ్‌ ప్యాసెంజర్‌ రైలు స్కూల్‌ బస్సును ఢీకొట్టిన ఘటనలో 18 మంది మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఉదయం హుటాహుటిన గేట్లు ఏర్పాటు చేశారు. ఉదయమే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది గేట్లను బిగించారు. రైలుమార్గం చుట్టుపక్కల ఉన్న పొదలను, చెట్లను తొలగించారు. ఇనుపచువ్వలకు రంగులు వేసి దూరం నుంచి కనిపించేలా ఏర్పాటు చేశారు. ట్రాక్‌ పైనా, రోడ్డుపైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా శుభ్రం చేశారు. అలాగే ఘటనా స్థలానికి సవిూపంలో ఉన్న 44వ జాతీయ రహదారి పక్కన కూడా పొదలను, మట్టిదిబ్బలను తొలగించారు. గేటు వద్ద తాత్కాలికంగా ఇద్దరు కాపలాదారులను నియమించారు. ప్రమాదం జరిగాక.. ప్రాణాలు పోయాక కానీ అధికారుల్లో చలనం రాలేదు. రెండు పదుల సంఖ్యలో పసిమొగ్గలు రాలిపోతే కానీ వారిలో నిగుఢీకృతమైన నిర్లక్ష్యం వీడలేదు. గేట్లు పెట్టండి అని పలుమార్లు స్థానికులు మొర పెట్టుకున్నా స్పందించలేదు.. ఫలితంగా 18 మంది మృత్యువాత పడ్డారు. గేట్లు పెట్టాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రైల్వే అధికారులపై దాడికి యత్నించారు. తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో రైల్వే శాఖ స్పందించింది. హుటాహుటిన గేట్లు ఏర్పాటు చేసింది.