కార్గిల్ అమరులకు ఘన నివాళి
కాశ్మీర్, జూలై 25 (జనంసాక్షి) :
కార్గిల్ యుద్ధ వీరులకు ఘన నివాళులర్పించారు. సైన్యాధ్యక్షుడు జనరల్ బిక్రమ్‌సింగ్ నేతృత్వంలో జమ్మూకాశ్మీర్‌లోని ద్రాస్ సెక్టార్‌లో సైనిక స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరుల త్యాగాన్ని ఆర్మీ చీఫ్ నెమరువేసుకున్నారు. జనరల్ సింగ్ జూలై 31న పదవీ విరమణ చేయనున్నారు. 1999లో పాకిస్తాన్‌తో కాశ్మీర్‌లోని లడక్ ప్రాంతంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయానికి ప్రతీకగా ఏటా జూలై 25న విజయ్ దివాస్ నిర్వహిస్తారు. యుద్ధంలో అమరులైన భారత సైనికులకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తారు. ఈ మేరకు శుక్రవారం 15వ విజయ్ దివాస్ నిర్వహించారు. కాశ్మీర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ హాజరై అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను పరిరక్షించగల సత్తా భారత సైన్యానికి ఉందని చెప్పారు. ‘సరిహద్దుల్లో మోహరించి ఉన్న భారత సైన్యానికి.. దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడగల సత్తా ఉందని ఆర్మీ చీఫ్‌గా స్పష్టం చేస్తున్నానని’ వ్యాఖ్యానించారు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం సైనికుల ఆకాంక్షలను అవసరాలను తీరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.