ఐటీ సంస్థలు స్వచ్ఛంద సేవలో పాల్గొనాలి

1
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై 26 (జనంసాక్షి) :

కార్పొరేట్‌, ఐటీ సంస్థలన్నీ విధిగా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కనీసం 2 శాతం నిధులు సమాజ సేవకు వినియోగించాలని సూచించారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని తెలిపారు. దేశంలో చాలా మంది దారిద్య రేఖకు దిగువన ఉన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని ప్యాప్సీలో ‘కార్పొరేట్‌ సంస్థలు – సామాజిక బాధ్యత’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. దేశంలో అనేక మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తున్నాయన్నారు. రూ.1000 కోట్ల టర్నోవర్‌ లేదా రూ.5కోట్ల ఆదాయం కలిగిన సంస్థలన్నీ తమ ఆదాయంలో రెండుశాతం సమాజసేవ కోసం వినియోగించాల్సి ఉందన్నారు. ఇందుకు కచ్చితమైన మార్గదర్శకాలు చట్టంలో ఉన్నాయని తెలిపారు. పేద, ధనిక వర్గాల మధ్య తారతమ్యాన్ని తగ్గించాల్సిన అవసరముందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు చేరని ప్రాంతాలపై కార్పొరేట్‌ సంస్థలు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్‌ సంస్థల ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.