విద్యావ్యవస్థను ట్రాక్ ఎక్కిస్తాం
కేజీ టు పీజీ కేసీఆర్ డ్రీమ్ : మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 26 (జనంసాక్షి) :
విద్యావ్యవస్థను త్వరలోనే ట్రాక్ ఎక్కిస్తామని విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఎల్‌కెజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించడంతో పాటు, విద్యారంగంలో సమూల మార్పులకు కృషి చేస్తున్నామని అన్నారు. అందరికీ నాణ్యమైన విద్య అనే అంశంపై పీఆర్‌టీయూ నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు. మారబోయే విద్యా వ్యవస్థ ప్రపంచంలో పోటీ పడేలా ఉంటుందని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చదువు చెబుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. పరీక్షల్లో ఫెయిలవుతే జీవితమే లేదు అన్నట్లు చేస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన విద్య అంటే ప్రశ్నలు జవాబులే కాదు అని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన చదువు చెప్పేందుకు ప్రయత్నించాలని సూచనలు చేశారు. ఇందులో భాగంగానే అందరికీ ఉచిత నిర్బంధ విద్యకు సీఎం కట్టుబడి ఉన్నారని అన్నారు. దీనికి ప్రణాళిక రూపకల్పన జరుగుతోందన్నారు. వచ్చేయేడు నుంచి దీనిని అమలుఎ చేస్తామన్నారు. కులాలలతో సంబంధం లేకుండా విద్యను ప్రతి ఒక్కరికీ అందించాలన్నదే ధ్యేయమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మహముద్ అలీ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నా కొందరు ప్రైవేటు వైపు మొగ్గు చూపడం బాధాకరమన్నారు. ప్రజా ప్రతినిధులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే మిగతా వారికి ఆదర్శంగా ఉంటుందని చెప్పారు. పది కిలోల బరువు లేని పిల్లలు 12 కిలోల బరువు మోస్తున్నారని తెలిపారు. ఈ విధానం పోయి విజ్ఞానం పెంచే విద్య రావాల్సి ఉందన్నారు. ఇదిలావుంటే బాలికలే ఎక్కువగా పాఠశాలకు దూరమవుతున్నారని టీఆర్‌ఎస్ నేత కె. కేశవరావు పేర్కొన్నారు. సదస్సులో పాల్గొన్న ఆయన అందరికీ నాణ్యమైన విద్య అనేది ఇక సాకారం కాబోతున్నదిన చెప్పారు. గ్రామీణ విద్యార్థులు చాలా మంది 8, 9 తరగతుల్లోనే విద్యను ఆపేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతమున్న సిలబస్‌లో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బాలికలు స్కూళ్లు మానేసే దుస్థితి పోవాల్సి ఉందన్నారు. తెలంగాణ విద్యార్థులకు ఫాస్ట్ పథకం ద్వారా న్యాయం జరుగుతదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ చెప్పారు. కళాశాలలు వ్యాపార దృక్పథంతో పని చేయొద్దని సూచించారు. విద్యార్థులకు నష్టం కలిగించే పనులు తెలంగాణ ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ఒక్క విద్యార్థికి కూడా నష్టం కలగకుండా ప్రభుత్వం పని చేస్తదని తేల్చిచెప్పారు. ఇదిలావుంటే విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని టీపీజేఏసీ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో, డెప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ల పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని మంత్రికి వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలని కోరినట్లు చెప్పారు. గతంలో బదిలీ అయిన ఉపాధ్యాయులను రీలివ్ చేయాలని కోరామని తెలిపారు.