ఆప్షన్లపై జేఏసీ అభ్యంతరం
భార్యాభర్తలు ఇద్దరూ ఆంధ్రోళ్లయినా ఆప్షన్లా?
కనీసం ఒక్కరైనా తెలంగాణోళ్లై ఉండాలి
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలి
కమల్‌నాథన్‌్ కమిటీ నివేదికపై పోరాడుతాం : దేవీప్రసాద్
హైదరాబాద్, జూలై 26(జనంసాక్షి) :
కమలనాథన్ కమిటీ విడుదల చేసిన మార్గదర్శకాలపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. అక్టోబర్ 31లోగా ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని జేఏసీ నాయకుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఎవరికీ ఆప్షన్లు ఇవ్వద్దని, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు. తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారిపై న్యాయవిచారణ జరపాలని కోరారు. ఆపషన్ల పేరుతో తెలంగాణ వారికి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆంధప్రదేశ్ జీఏడీ విభజనతో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజన మొత్తం స్వతంత్ర సంస్థతో నిర్వహించాలని, తమకు మాకు అన్యాయం జరిగితే మరోసారి ఉద్యమిస్తామని జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ స్పష్టం చేశారు. ఉద్యోగుల విభజన విషయంలో కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేసేలా ఉన్నాయని స్పష్టం చేశారు. శనివారం టీఎన్జీవో భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా ఉద్యోగులను ఆంధ్రాకే పంపించాలని డిమాండ్ చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలన్నారు. ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలోనే పని చేసేలా మార్గదర్శకాలు ఉండాలని చెప్పారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన ఆప్షన్ ఫాంలో తప్పులు ఉన్నాయని తెలిపారు. హెచ్‌వోడీలు ఎన్ని ఉన్నాయో ప్రకటించాలని దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఇదిలావుంటే ఉద్యోగుల స్థానికతకు కమలనాథన్ కమిటీ స్పష్టత ఇచ్చింది. ఏడేళ్లపాటు విద్యాభ్యాసం ఆధారంగానే స్థానికతను గుర్తించాలని కమలనాదన్ కమిటీ పేర్కొంది. ఉద్యోగులందరికి ఆప్షన్లు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఒకసారి ఆప్షన్ ఇస్తే మార్చుకునే అవకాశం ఉండదు. అలాగే దంపతులు, ఒంటరి మహిళలకు ప్రధమ ప్రధాన్యం ఇవ్వాలని కూడా కమిటీ నిర్దేశించింది. కమిటీ చేసిన సిఫారస్‌లను వెబ్ సైట్ లో ఉంచారు. భార్యాభర్తలకు ఆప్షన్లలో ప్రాధాన్యత ఇస్తామన్న కమిటీ వారివురూ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారైనా ఆప్షన్ల పేరుతో తెలంగాణ కొనసాగేందుకు వెసులుబాటు కల్పించిందని దీన్ని సరిదిద్దాలని కోరారు. భార్యాభర్తల్లో ఎవరైనా ఒక్కరు తెలంగాణకు చెందిన వారైతేనే ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమల్‌నాథన్ కమిటీ నివేదికపై పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.