విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తాం
కేజీ నుంచి పీజీ నిర్బంధ ఉచిత విద్య అందిస్తాం : సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూలై 26 (జనంసాక్షి) :
విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నిర్బంధంగా ఉచిత విద్యను అందించాలన్న దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. దశలవారీగా కేజీ నుంచి పీజీ వరకు దీనిని అమలు చేస్తామన్నారు. ఇది ఎవరి కోసమో లేదా ఎన్నికల హావిూ ప్రకటనో కాదన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, 16 ఉపాధ్యాయ సంఘాలతో శనావారం ఇక్కడ కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్ తరహాలో కామన్ స్కూల్ విధానం తన కల అని తెలిపారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామన్నారు. కులమతాలకు అతీతంగా పిల్లలకు విద్యను అందించాలన్నదే తన లక్ష్యమన్నారు. దీనికి ఎంత ఖర్చయినా వెనకాడమన్నారు. దీనివల్ల కులరహిత సమజానికి కూడా బీజం వేసినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఉచిత విద్యావిధానం దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు దశలవారిగా దీనిని అమలు చేస్తామన్నారు. పన్నెండేళ్ల తర్వాత రాష్ట్రమంతా ఆంగ్ల మాధ్యమ స్కూళ్లు ఉంటాయన్నారు. రాష్ట్రమంతా కేజీ టు పీజీ ఆంగ్లమాధ్యమ స్కూళ్లను విస్తరిస్తామన్నారు. గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లుగా మార్చే యోచన చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్‌పై తర్వలో నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.