సహరన్‌పూర్‌లో కనిపిస్తే కాల్చివేత

4
కర్ఫ్యూ విధింపు.. కొనసాగుతున్న ఉద్రిక్తత

38 మంది అరెస్టు

లక్నో, జూలై 27 (జనంసాక్షి) :

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో కనిపిస్తే కాల్చివేతకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి అది తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు తొలుత 144 సెక్షన్‌ విధించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై జిల్లా మెజిస్ట్రేట్‌ సంధ్య మాట్లాడుతూ, శనివారం జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, పోలీసు అధికారి సహా 19 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఒక వర్గానికి చెందిన స్థలంలో మరో వర్గం వారు ప్రహరీ నిర్మాణం చేపట్టగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని చెప్పారు. ఈనేపథ్యంలో శనివారం 20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం మరో 18 మందిని అరెస్టు చేశారు. ఇరు వర్గాలకు చెందిన వారిపై తొమ్మిది కేసులు నమోదు చేశారు. సహరాన్‌పూర్‌ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. 20 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.