అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాదే భేష్‌

5
ఐటీ రంగంలో మన షహర్‌కు తిరుగులేదు

విప్రోతో హైదరాబాద్‌కు అనుబంధం

సీఎం కేసీఆర్‌తో విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ భేటీ

హైదరాబాద్‌, జులై 27 (జనంసాక్షి) :

అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్‌ ఉత్తమమైనదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను భారతదేశానికే తలమానికం అయ్యేవిధంగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్రం పెడ్డుబడులు పెట్టడానికి అత్యంత అనుకూలమైన ప్రాంతంగా కనిపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఆదివారం విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు, తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో విప్రో సంస్థల గురించి, హైదరాబాద్‌తో సంబంధం గురించి ప్రేమ్‌జీ కేసీఆర్‌కు వివరించారు. తెలంగాణలో తమ సంస్థలను విస్తరించనున్నట్లు, ఇందుకు ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహం కావాలని ఆయన కోరారు. దీనికి స్పందించిన కేసీఆర్‌ త్వరలో రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతి ఇవ్వడానికి పారదర్శకమైన, అవినీతిరహితమైన సింగిల్‌విండో విధానాన్ని తెస్తున్నామని చెప్పారు. సీఎంవోలోనే దీనికి సంబంధించి ఛేజింగ్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఐటి, పారిశ్రామిక రంగంలో తీసుకొస్తున్న మార్పులు, విధానాలను వివరించారు. నగరాన్ని 4జీ వైఫై నగరంగా మారుస్తున్నామని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన ఐటిఐఆర్‌ ప్రాజెక్టును సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. తెలంగాణాలో మరిన్ని ఐటీ పార్కులు రావడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరగయ్యేందుకు ఐటీ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తామని సిఎం వెల్లడించారు. త్వరలో పారిశ్రామిక విధానానికి తుదిరూపం ఇస్తామన్నారు. మరోసారి చర్చలు జరిపి విప్రోతో కలిసి పనిచేసే అంశాలపై నిర్ణయం తీసుకుందామని అన్నారు. వీరి భేటీ గంటన్నర పాటు కొనసాగింది. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.