వర్షం.. హర్షం
అల్పపీడనం రూపంలో ఆదుకున్న వరుణుడు
తెలంగాణలో భారీ వర్షాలు
హైదరాబాద్, జూలై 28 (జనంసాక్షి) :
ఎట్టకేలకు వరుణుడు తుపాను రూపంలో రైతులపై కరుణ చూపాడు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతన్నల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సరైన వర్షాలు లేక ఖరీఫ్ సీజన్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ తాజా వర్షాలతో ఆశలు మళ్లీ చిగురించాయి. ఇదే రకంగా వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వరినాట్లు వేస్తున్నారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో నదులు జలకళ సంతరించుకుంటున్నాయి. కృష్ణ, గోదావరి నదులకు వరద పోటెత్తుతోంది. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. స్టేషన్ గన్‌పూర్‌లో భారీ వర్షాల కారణంగా మోరంచ వాగు పొంగిపొర్లుతోంది. దీంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్టుల ప్రాంతంలో రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇక్కడ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో ఖమ్మం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు చెందిన ఏడు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దిగువకు పది వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అశ్వారావుపేటలోని మధ్యతరహా ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం 18 అడుగులకు చేరింది. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ఆశలు వదిలేసుకున్న నల్లగొండ జిల్లా రైతులకు ఈ జల్లులు మళ్లీ ఆశలు చిగురింపజేశాయి. దీంతో రైతులు విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. మిర్యాలగూడలో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రారంభమైంది. కడెం ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఆరెపల్లిలో వర్షం కారణంగా ఓ ఇల్లు కూలి ఇద్దరు గాయపడ్డారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో వేసిన వరినాట్లు ముంపునకు గురయ్యాయి. విద్యుత్ స్తంభాలు నెలకొరగడంతో ఆచంట మండలంలోని ఆరు గ్రామాల్లో అంధకారం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల వరకు వర్షం నీళ్లు నిలిచిపోయాయి. రైల్వే స్టేషన్, కంభాల చెరువు, సీతంపేట, ఆర్యపురం తదితర ప్రాంతాల్లో నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
48 గంటల్లో భారీ వర్షాలు
రాగల 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. వాయవ్య బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని తెలిపింది. 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావం వల్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ శాఖ తెలిపింది.