ఎయిమ్స్ తరహాలో తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
ఒకే చోట 200 ఎకరాల స్థలం ఉండేలా చూడండి
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ లేఖ
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 28 (జనంసాక్షి) :
తెలంగాణలో ఎయిమ్స్ తరహా ఆసుపత్రిని నెలకొల్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాసిన లేఖతో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డా.హర్షవర్దన్ స్పందించారు. తెలంగాణలో ఎయిమ్స్ తరహా సూపర్ స్పేషాలిటీ ఆసుపత్రి కమ్ టీచింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి లేఖ రాశారు. ఒకే చోట 200 ఎకరాల స్థలం వుండేలా మూడు నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసి ప్రతిపాదనలను పంపాలని కోరారు. ఎయిమ్స్ స్థాపనకు సంబంధించిన స్థలాన్ని సమకూర్చడంతో పాటు విద్యుత్, నీరు,
రోడ్ల లాంటి మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాల్సి వుంటుంది. ఆసుపత్రి నిర్మాణానికి, నిర్వహణకు అయ్యే వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాలలో కేంద్రం నుండి వచ్చే బృందం పరిశీలించి ఎంపిక చేస్తుందని కేంద్రమంత్రి తన లేఖలో పేర్కోన్నారు. లేఖ అందినవెంటనే ముఖ్యమంత్రి దీనిపై స్పందించారు. అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఒకే చోట రెండు వందల ఎకరాల ఉండేలా మూడు, నాలుగు చోట్ల ఎంపిక చేసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు పంపించాలని సూచించారు.