నేడు ఈద్-ఉల్-ఫితర్
ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు
హైదరాబాద్, జూలై 28 (జనంసాక్షి) :
ముస్లింల అతి పవిత్ర పర్వదినం ఈద్-ఉల్-ఫితర్‌ను మంగళవారం జరుపుకోనున్నారు. సోమవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోవాలని రివాయత్ హలాల్ కమిటీ ప్రకటించింది. భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, అసోం రాష్ట్రాలలో నెలవంక కనిపించినట్లు రివాయత్ హలాల్ కమిటీ వెల్లడించింది. పవిత్ర ఈద్-ఉల్-ఫితర్ సందర్బంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి లోక కళ్యాణం కోసం దైవ ప్రార్థనలో నిమగ్నమైన ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ సందర్బంగా దీక్షలు విరమిస్తున్నారన్నారు. అల్లా కృపతో ముస్లింలందరి జీవితాల్లో ఈ పండుగ వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సమాజంలోని అన్ని వర్గాలు కూడా ఇలాంటి శుభసందర్బంలో మత సామరస్యం వెల్లివిరిసేందుకు పరస్పరం స్నేహ భావాన్ని పంచుకోవాలని పిలుపునిచ్చారు.