గాజాపై మోడీ నోరెందుకు విప్పడంలేదు

1http://JanamSakshi.org/imgs/2014/07/127.jpg

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌ సూటి ప్రశ్న

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కేసీఆర్‌ విధానాన్ని సమర్థిస్తున్నా : తమ్మినేని

వరంగల్‌, జూలై 30 (జనంసాక్షి) : గాజాపై ఇజ్రాయిల్‌ దాడులతో అమాయకులు చనిపోతుంటే మోడీ సర్కార్‌ నోరు విప్పకపోవడంపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తప్పుపట్టారు. బుధవారం వరంగల్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారీ ప్రదర్శనను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి అమెరికా జేబు సంస్థగా మారిందని ఆయన దుయ్యబట్టారు. గాజాపై ఇజ్రాయిల్‌ దాడులతో మృతుల సంఖ్య వెయ్యి దాటినా నిన్న ఒక్కరోజే వందమంది చనిపోయినా భారత ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చిన భాజపా సర్కారు ఒక్క ప్రజోపయోగ కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదని ఆయన విమర్శించారు. ప్రజలపై పన్నుల భారాన్ని మోపిందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తెలంగాణ కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌ విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని పూర్తిగా తమ పార్టీ సమర్థిస్తుందన్నారు. తెలంగాణ బడ్జెట్‌ నుంచి పక్క రాష్ట్రాల విద్యార్థులకు ఫీజులు కట్టే ఆనవాయితీ ఉండదన్నారు. వివిధ రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో విద్యనభ్యసిస్తున్నారని ఆంధ్రా విద్యార్థులకు బోధనా రుసుము చెల్లిస్తే ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కూడా చెల్లించాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వ వాదనతో తాము ఏకీభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతకుముందు సాంస్కృతిక బృందాలతో ప్రదర్శన నగరవాసులను ఆకట్టుకుంది.