చుండూరు నిందితులకు నోటీసులు

3
హైకోర్టు తీర్పుపై ‘సుప్రీం’ స్టే

న్యూఢిల్లీ, జూలై 30 (జనంసాక్షి) :  చుండూరు సామూహిక ఊచకోత కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 20 మంది యావజ్జీవ కారాగార శిక్షలను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. ఈ కేసులో నిందితులకు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం నోటీసులు జారీ చేసింది. చుండూరు ఊచకోత కేసులో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ మదన్‌బిలోకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కింది కోర్టు తీర్పును నిలుపుదల చేసింది. అలాగే చుండూరు ఘటనపై హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించింది. గుంటూరు జిల్లా చుండూరులో 1991 ఆగస్టు 6న జరిగిన ఊచకోతలో 8 మంది దళితులు దారుణ హత్యకు గురయ్యారు. అగ్రవర్ణాలకు చెందిన పలువురు దళితులను కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటనపై అప్పట్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కింది కోర్టు కేసు విచారణ పూర్తి చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువరించింది. నిందితులకు ఉరిశిక్ష విధించే అరుదైన కేసు కాదని పేర్కొన్న ప్రత్యేక న్యాయమూర్తి అనీస్‌ 2007 ఆగస్టు 1న తీర్పు వెలువరించారు. మొత్తం 179 మంది నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. 21 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, 35 మందికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలు లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు, శిక్ష పడిన వారు తమ శిక్షను రద్దు చేయాలనంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 20 మందిని, ఇతర శిక్షలు అనుభవించిన మరో 36 మందిపై మొత్తం శిక్షలు రద్దు చేస్తూ 2014 ఏప్రిల్‌ 22న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై దళిత, ప్రజా సంఘాల నుంచి తీవ్రస్థాయిలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో చుండూరు ఊచకోత వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, మృతుల బంధువులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాధితుల తరఫున బొజ్జా తారకం వాదనలు వినిపించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది.